Reading Time: 2 minutes
Ap Cabinet Meeting 40 Plus Agenda Items Key Amaravati Decisions Likely

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు ఉదయం 10.30 గంటలకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. 40కి పైగా అంశాలతో రూపొందించిన అజెండాపై కేబినెట్ చర్చించనుంది. ముఖ్యంగా రాజధాని అమరావతికి సంబంధించిన సీఆర్‌డీఏ ప్రతిపాదనలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అమరావతిలో సెంట్రల్ లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి సుమారు రూ.596 కోట్లతో చేపట్టనున్న ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అదనంగా రూ.533 కోట్ల కేటాయింపుపై కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది.

రాజధాని గ్రామాల్లో రైతులకు కేటాయించిన ప్లాట్ల పరిధిలోని చిన్న రహదారుల్లో సీసీ రోడ్లకు బదులుగా బీటీ రోడ్లు నిర్మించేందుకు సీఆర్‌డీఏ తీసుకున్న నిర్ణయానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉందని సమాచారం. మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ పరిధికి అమరావతిలోని స్టోరేజ్ ట్యాంకుల నుంచి తాగునీరు సరఫరా చేసే ప్రతిపాదనపైనా మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. అమరావతిలో డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ ఏర్పాటు కోసం డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ రూపొందించే అంశంపై కూడా కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే రాజధాని పరిధిలోని వివిధ గ్రామాల్లో సుమారు 42 ఎకరాలను ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో అభివృద్ధి చేసే ప్రతిపాదనపైనా నిర్ణయం తీసుకోనున్నారు.

తాడికొండ, కంతేరు గ్రామాల పరిధిలో ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే లైన్ కోసం అవసరమైన భూములను ల్యాండ్ పూలింగ్ విధానంలో సమీకరించే ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీంతో అమరావతి అభివృద్ధి పనులకు సంబంధించి మరిన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది. అజెండా అంశాలపై చర్చ పూర్తయ్యాక తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన తాజా పరిస్థితులు, ఎన్నికల ప్రక్రియ వంటి అంశాలపై మంత్రివర్గంలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అలాగే సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై మంత్రులకు సీఎం కీలక సూచనలు చేసే అవకాశం ఉంది. ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాలు, నిర్ణయాలపై సరైన సమాచారం వెళ్లేలా మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించే అవకాశముంది. ఉద్యోగుల సమస్యలపై కూడా అజెండా అనంతరం ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఉద్యోగుల డిమాండ్లు, పరిపాలనా అంశాలు, వివిధ శాఖలకు సంబంధించిన పెండింగ్ సమస్యలపై మంత్రులతో సీఎం సమీక్షించే అవకాశం ఉంది.