
BCCI Focus on Vaibhav Sooryavanshi: భారత క్రికెట్‌లో 15 ఏళ్ల వయసులోనే సంచలనాలు సృష్టిస్తున్న యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రత్యేక దృష్టి పెట్టింది. భవిష్యత్ స్టార్‌గా ఎదుగుతున్న వైభవ్ ఒక్క సిరీస్ లేదా ఒక్క ఏడాదికే పరిమితం కాకుండా.. సుదీర్ఘ కాలం దేశానికి సేవలందించే క్రికెటర్‌గా ఎదగాలని బీసీసీఐ కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో బుడ్డోడికి సరైన మార్గదర్శకత్వం, అవసరమైన మద్దతు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు.
గురువారం ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో కీలక సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియాతో పాటు భారత టెస్టు-వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్, టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అధిపతి వీవీఎస్ లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో యువ ఆటగాళ్ల భవిష్యత్తుపై చర్చించినట్లు తెలుస్తోంది. వైభవ్ సూర్యవంశీతో పాటు యువ ప్రతిభావంతుల ఆటతీరును బీసీసీఐ నిశితంగా పరిశీలిస్తోందని సైకియా వెల్లడించారు. 15 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌లో సత్తా చాటుతున్న వైభవ్ విషయంలో ప్రతి అడుగును జాగ్రత్తగా వేయాలని బోర్డు భావిస్తోందన్నారు. అతడు ‘వన్ సిరీస్ లేదా వన్ ఇయర్ వండర్’గా మిగిలిపోకుండా.. దిగ్గజం సచిన్ టెండూల్కర్ మాదిరిగా సుదీర్ఘ కాలం దేశానికి సేవలందించే క్రికెటర్‌గా ఎదగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
వైభవ్ సూర్యవంశీ కెరీర్‌ను బీసీసీఐ అన్ని కోణాల్లో పర్యవేక్షిస్తోందని దేవజిత్ సైకియా చెప్పారు. అతడి ఆటతో పాటు భవిష్యత్తులో తీసుకోవాల్సిన నిర్ణయాలు, అవసరమైన మార్గదర్శకత్వం, మద్దతుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నట్లు తెలిపారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ రికార్డులను ఖాతాలో వేసుకుంటున్నాడు. తాజాగా 15 ఏళ్ల 157 రోజుల వయసులో దులీప్ ట్రోఫీ చరిత్రలో హాఫ్ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. దీంతో 57 ఏళ్లుగా ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. అంతకుముందు జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ వైభవ్ ఆకట్టుకున్నాడు. ఆ సిరీస్‌లో 151 పరుగులు చేసి భారత్ 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. తొలిసారి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డును కూడా అందుకున్నాడు.
వైభవ్ సూర్యవంశీకి అంతర్జాతీయ స్థాయిలో అవకాశం రావడానికి ముందు ఐపీఎల్ 2026లో అతడు చేసిన విధ్వంసకర బ్యాటింగే ప్రధాన కారణం. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ 776 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్‌రేట్ ఏకంగా 237.30గా ఉండటం విశేషం. ఈ సీజన్‌లో ఒక సెంచరీతో పాటు ఐదు అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. అంతేకాకుండా ఐపీఎల్ 2026లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచి.. ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో 72 సిక్సర్లు బాదడంతో మరో రికార్డు సృష్టించాడు. టోర్నీ అనంతరం మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్, సూపర్ స్ట్రైకర్, సూపర్ సిక్సెస్ వంటి పలు అవార్డులను కూడా అందుకున్నాడు.
ఈ ఏడాది జరిగిన ఐసీసీ పురుషుల అండర్-19 ప్రపంచకప్‌లోనూ వైభవ్ తన సత్తా చాటాడు. టోర్నీలో 439 పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా ఎంపికయ్యాడు. దీంతో భారత క్రికెట్‌లో భవిష్యత్ స్టార్‌గా అతడిపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే భారత తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా కూడా వైభవ్ రికార్డు సృష్టించాడు. వరుసగా దేశవాళీ క్రికెట్, ఐపీఎల్, అండర్-19, అంతర్జాతీయ స్థాయిలో మెరుస్తున్న ఈ యువ ఆటగాడిపై బీసీసీఐ ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వైభవ్ ప్రతిభను సరైన విధంగా తీర్చిదిద్ది.. అతడికి సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్ అందించడమే బీసీసీఐ లక్ష్యంగా కనిపిస్తోంది.