Reading Time: 2 minutes

భార్యకు నెలవారి జీతం చెల్లిస్లున్న ప్రభుత్వ ఉద్యోగి.. రెడ్డిట్ పోస్ట్ వీడియో వైరల్..నెట్టింట బిగ్ డిబేట్

Caption of Image.

భార్యకు ప్రతి నెలా జీతం ఇవ్వాలన్న ఒక వ్యక్తి నిర్ణయం, మ్యారేజ్ లైఫ్ లో జీతంలేని ఇంటి పనులకు ఇచ్చే విలువ గురించి ఆన్‌లైన్‌లో చర్చకు దారితీసింది. భార్యాభర్తల్లో ఒకరు ఇంటిని చూసుకుంటూ, మరొకరు సంపాదించే ఆర్థిక స్వాతంత్ర్యంపై కూడా ప్రశ్నలను లేవనెత్తింది. ప్రభుత్వ అధికారిగా పనిచేస్తున్న ఓ ఉద్యోగి తన భార్య చేసే పనికి గుర్తింపుగా నెలవారీ  జీతం ఇస్తున్న వివరాలను అతని సోదరుడు అయిన ఓ యూజర్ రెడ్డిట్‌లో షేర్ చేయడంతో ఈ చర్చ మొదలైంది.

రెడ్డిట్ యూజర్ ప్రకారం..అతని సోదరుడు అయిన ప్రభుత్వ ఉద్యోగి  భార్య చేస్తున్న  ఇంటి పనులకు నెల నెలా కొంత అమౌంట్ చెల్లించాలని నిర్ణయించుకున్నారు. పనిమనుషులను పెట్టుకుని ఇంటి పనులు చేయించుకుంటే ఎంత ఖర్చు అవుతోంది లెక్కగట్టి అంత మొత్తం భార్యకు  ప్రతి నెలా ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. అలాగే ఇస్తున్నాడు కూడా.ఇంటిపనిని తన భార్య ఉచితంగా చేయడం ఇష్టం లేదని కూడా ప్రకటించాడు. 

ఈ పోస్ట్ ప్రకారం.. తన భార్యకు చెల్లించిన మొత్తాన్ని ఆమె ఇష్టానికి వాడుకోవచ్చు.   భర్త అనుమతి లేకుండా  ఖర్చు చేసుకోవచ్చు. పొదుపు చేసుకోవచ్చు,  తల్లిదండ్రులకు కూడా ఇచ్చుకోవచ్చు.  తన భార్య కు ఇచ్చింది ఆమెకు నచ్చిన విధంగా ఖర్చు చేసుకోవచ్చని సెలవిచ్చారు ఆ ప్రభుత్వ ఉద్యోగి.    

ఇక తన పోస్టుపై తానే ఓ స్పందన  కూడా  తెలిపాడు రెడ్డిట్ యూజర్.  వివాహ బంధాన్ని యజమాని , ఉద్యోగి సంబంధంగా మార్చడం తన   ఉద్దేశం కాని స్పష్టం చేశాడు. భార్యభర్తలు ఇద్దరు సమాన భాగస్వాములుగా భావించుకున్నారని  చెప్పారు. సాధారణంగా మన భారతీయ జంటల్లో ఉండే  ఆర్థిక విధానానికి ఇది పూర్తి భిన్నంగా ఉందని కూడా చెప్పుకొచ్చారు యూజర్. 

అంతేకాదు.  ఒక గృహిణికి ఇలా కొంత జీతంలా  చెల్లించడం ద్వారా ఆమె ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుందంటున్నారు. ఆమె  పనికి అధికారిక  గుర్తింపు ఉంటుందంటూనే ఇలా చెల్లించడం వల్ల వివాహం బంధం లావాదేవీగా మారుతుందా అని రెడ్డిట్ యూజర్ తన డౌట్ ను వ్యక్తం చేశాడు. 

ఆదర్శభర్త జీతంపై వచ్చిన ఈ పోస్ట్  సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది.  గుర్తింపు లేని గృహిణి దక్కిన గౌరవం అని కొందరంటుండగా.. భార్యభర్తలిద్దరూ కుటుంబ బాధ్యతలు, ఆర్థిక వాటాలను సరిసమానంగా పంచుకోవాలని  వాదించారు. భార్యభర్తలు ఇద్దరు ఎవరూ ప్రతి కుటుంబానికి సరిపోయే ఏర్పాటును కనుక్కోవాలని సూచించారు. ఇంకొందరు  ఈ ఏర్పాటు ఆచరణాత్మక అంశంగా భావిస్తూ ప్రతి గృహిణికి వ్యక్తి గత ఖర్చుకోసం ప్రతి సారి భర్త/భార్యను అడగాల్సిన అవసరం ఉండదు.. నిజానికి ఈ ఆలోచన సరైనదే, ఆమె ప్రతిరోజూ సమయాన్ని, శ్రమను వెచ్చిస్తోంది, కాబట్టి ఆమెకు సొంతంగా డబ్బు ఉండటం న్యాయమే అని వాదించారు. ఆమె సొంతంగా నెలవారీ డబ్బు వస్తున్నప్పటికీ , ఆర్థికంగా భర్తపై ఆధారపడి ఉంటుంది.. ఇది స్వే్చ్ఛా, స్వాతంత్ర్యం, అవకాశాలకు డబ్బు ప్రత్యామ్నాయం కాలేదని స్పష్టం చేశారు. 

నిజానికి ఒక్కో కుటుంబం పరిస్థితి ఒక్కోలా ఉంటుంది. జీతం ఇవ్వాలా వద్దా అనే దానికంటే భార్యాభర్తలు ఇద్దరూ పరస్పర గౌరవం, ఆర్థిక స్వేచ్ఛ,  సమాన నిర్ణయాధికారం కలిగి ఉండటమే ఆరోగ్యకరమైన దాంపత్యానికి ముఖ్యమైన అంశమని చెప్పొచ్చు. గృహిణి చేసే ఇంటి పని విలువైనదే.దానికి గుర్తింపు, ఆర్థిక భద్రత ఎలా కల్పించాలనేది ప్రతి కుటుంబం కలిసి నిర్ణయించుకోవాల్సిన విషయం అని అనుభవజ్ణులు చెబుతున్నారు. 

©️ VIL Media Pvt Ltd.