
Bethlehem Kudumba Unit Review: నివిన్ పౌలీ హీరోగా, తెలుగులో ఫేమస్ అయిన మమితా బైజు హీరోయిన్‌గా రూపొందిన తాజా చిత్రం ‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’. ఈ సినిమాని అదే పేరుతో తెలుగులో డబ్ చేసి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ రిలీజ్ చేసింది. ‘ప్రేమలు’ డైరెక్టర్ గిరీష్ ఏడీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ‘ప్రేమలు’ ఫేమ్ సంగీత్ ప్రతాప్ కూడా ఒక కీలక పాత్రలో నటించాడు. మలయాళంలో సుమారు 200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమాని, తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేయడంతో పాటు ప్రమోషనల్ కంటెంట్ కూడా వర్కౌట్ కావడంతో, ఈ సినిమా మీద ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ కథ:
కేరళలోని ఒక గ్రామంలో క్యాటరింగ్ సర్వీస్ నిర్వహిస్తూ ఉండే జస్టిన్ (నివిన్ పౌలీ), కాలేజీ రోజుల్లో ప్రేమించిన అమ్మాయి చనిపోవడంతో అప్పటినుంచి సింగిల్‌గానే ఉండిపోతాడు. అతని తమ్ముడు (సంగీత్ ప్రతాప్) సహా స్నేహితులతో కలిసి సరదా సరదాగా జీవిస్తూ ఉంటాడు. అయితే, అనుకోకుండా అతని పక్క ఇంట్లో యాష్లే (మమితా బైజు) ఫ్యామిలీ అద్దెకు దిగుతుంది. మొదట ఇరుగుపొరుగుగా పరిచయమైన వీరి ప్రయాణం ప్రేమ వరకు వెళుతుంది. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ భారీగా ఉండడంతో వీరి ప్రేమ బయటపడకుండా ఉండాలని ఇద్దరూ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుని మరీ ప్రేమలో మునిగితేలుతూ ఉంటారు. అయితే అనూహ్యంగా వీరి విషయం బయటపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు వీరి ప్రేమ విషయం ఎలా బయటకు వచ్చింది? చివరికి ఏం జరిగింది? అనే విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ: ‘ప్రేమలు’ డైరెక్టర్, నివిన్ పౌలీ లాంటి తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న హీరో, అంతకుమించి ఫ్యాన్ బేస్ ఉన్న హీరోయిన్ మమితా బైజు కాంబినేషన్‌లో సినిమా వస్తుంది అనగానే చాలామంది తెలుగు ప్రేక్షకులు మలయాళ వర్షన్‌ని చూసేశారు. అయితే మలయాళ వర్షన్ ఏకంగా 200 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించడంతో మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ దాన్ని తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేయాలనుకున్నారు. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా, ఫహద్ ఫాసిల్ నిర్మాతగా ఆ కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. దీంతో సినిమా మీద బజ్ అమౌంట్ పెరిగింది. ఇక ఒకరోజు ముందుగానే మీడియాకు ప్రీమియర్ ప్రదర్శించారు.
ఇక షో మొదలైన తరువాత వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి తీసుకువెళ్లిపోయాడు దర్శకుడు. తండ్రి తాగుడు మాన్పించడం కోసం ఊరు మారి వచ్చిన ఓ కుటుంబం, పక్కనే ఉన్న మరో కుటుంబం అంటూ ఇలా ఒక్కొక్క కుటుంబాన్ని పరిచయం చేస్తూ వెళ్ళాడు దర్శకుడు. ఒక చిన్న ఊరి సెటప్, అందులో క్యాటరింగ్ బిజినెస్ చేసుకునే హీరో, కాలేజీకి వెళ్లి చదువుకునే హీరోయిన్ అంటూ ఒక్కొక్కరి పాత్రను చాలా సింపుల్‌గా చెప్పుకుంటూ వెళ్ళాడు. ఇక నెమ్మదిగా మనం బయట నుంచి చూస్తున్నట్టు కాకుండా, అదే ఊరిలో ఒక పాత్రలాగా చుట్టూ జరుగుతున్న విషయాలు అబ్జర్వ్ చేస్తున్న ఫీలింగ్ తీసుకురావడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
ఇక ఆ పాత్రల చుట్టూ రాసుకున్న కామెడీ వర్కౌట్ అయింది, ముఖ్యంగా తెలుగు డైలాగ్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా ఉన్నాయి. పెద్దగా కథేమీ లేదు; హీరో హీరోయిన్ ప్రేమలో పడటం, ఆ ప్రేమను పెద్దలు ఒప్పుకోకపోవడం, ఆ పెద్దలను ఎలా ఒప్పించి ఒకటయ్యారు అనేది సింపుల్‌గా కథ. అయితే దాన్ని ఆసక్తికరంగా కొన్ని నవ్వులు, కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ అంటూ దర్శకుడు చక్కగా తీసుకువెళ్లాడు. ఎక్కడా ఇబ్బందికర సన్నివేశాలు లేకుండా సింపుల్‌గా కథ నడిపించడంలో సక్సెస్ అయ్యాడు. మొత్తంగా చూసుకుంటే తెలుగు డైలాగ్స్‌లో కాస్త వ్రగారిటీ, ఇప్పటికీ తగ్గట్టు కొన్ని జోక్స్ ఉన్నాయి కానీ మిగతాదంతా ప్రేక్షకులను ఆకట్టుకునేలానే ఉంది.
ఇక నటీనటుల విషయానికొస్తే, నివిన్ పౌలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు; జస్టిన్ అనే పాత్రలో ఇమిడిపోయాడు. ఇక మమితా బైజు నటనలో పరిణితి కనిపించింది, కొన్నిచోట్ల కళ్ళతోనే నటిస్తూ ఆకట్టుకుంది. ఇక సంగీత్ ప్రతాప్ కనిపించిన ప్రతిసారి నవ్వించే ప్రయత్నం చేశాడు; అతని పాత్ర ఈ సినిమాకి చాలా హైలైట్ అవుతుంది అనడంలో సందేహం లేదు. ఇక శ్యామ్ మోహన్ సహా సినిమాలో నటించిన ఇతర నటీనటులు అందరూ తమ పాత్రలకు ప్రాణం పోశారు. నిజంగా ఆ ఊరి ప్రజలే అన్నట్టుగా వారు తమ పాత్రలలో ఇమిడిపోయారు.
ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే, కథా స్క్రీన్ ప్లే కరెక్ట్‌గా కుదిరాయి. అలాగే తెలుగు డైలాగ్స్ కూడా వర్కౌట్ అయ్యాయి. ‘ప్రేమలు’ ఎంత బాగా వర్కౌట్ అయిందో, ఈ సినిమా కూడా తెలుగు ప్రేక్షకులకు ఎక్కేలా తీసుకుని రావడంలో టీం సక్సెస్ అయింది. ఇక మ్యూజిక్ కరెక్ట్‌గా వర్కౌట్ అయింది, బీజీఎం కూడా సినిమాకి తగ్గట్టుగా సరిపోయింది. పాటలు కొన్ని బాగున్నాయి; తెలుగువారికి పెద్దగా ఎక్కకపోయినా సందర్భానుసారం సాగిపోయేలా ఉన్నాయి. నిడివి కూడా పెద్దగా వంకలు పెట్టేలా లేదు. ఇక సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
ఫైనల్‌గా ‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’ ఒక చిల్ టైం పాస్ ఎంటర్‌టైనర్.. ఫన్, ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్.