
- రూ.15 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యం
- ప్రగతి నివేదిక విడుదల చేసిన మంత్రి జూపల్లి
హైదరాబాద్, వెలుగు: 1000 రోజుల ప్రజాప్రభుత్వంలో రాష్ట్ర పర్యాటక రంగం గణనీయమైన పురోగతిని సాధించిందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పాలసీల రూపకల్పన నుంచి భారీ పెట్టుబడుల వరకు, గ్లోబల్ బ్రాండింగ్ నుంచి టూరిజం ప్రాజెక్టుల వరకు తెలంగాణ దేశంలోనే మంచి పర్యాటన గమ్యస్థానంగా ఎదుగుతోందని వెల్లడించారు.ఈ మేరకు బుధవారం ఆయన పర్యాటక ప్రగతి నివేదికను విడుదల చేశారు.రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా ప్రభుత్వం ఒక సరికొత్త టూరిజం పాలసీని తీసుకువచ్చిందన్నారు.
ఈ రంగంలో రూ.15,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు 3 లక్షల మందికి ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. దేశంలోని టాప్-5 టూరిజం రాష్ట్రాల్లో తెలంగాణను నిలపడంతో పాటు జీడీపీలో టూరిజం వాటాను పెంచేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలు, 6 టూరిజం క్లస్టర్లను గుర్తించామన్నారు. రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని.. తెలంగాణ టూరిజం కాంక్లేవ్ ద్వారా 30 ప్రాజెక్టులకు రూ.15,279 కోట్లు, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ద్వారా మరో రూ.7,045 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని పేర్కొన్నారు.