
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగి భారత జాతీయ జట్టులోకి దూసుకొచ్చిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. జూన్‌లో ఇంగ్లాండ్‌పై అంతర్జాతీయ అరంగేట్రం చేసినప్పటికీ, ఆ తర్వాత జరిగిన జింబాబ్వే పర్యటనలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుతో తన ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పాడు. ఇప్పటివరకు తాను ఆడిన 6 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ అభిషేక్ శర్మతో కలిసే ఓపెనింగ్ చేశాడు. కానీ, సెప్టెంబర్ 13వ తేదీన ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరగబోయే మ్యాచ్ ద్వారా వైభవ్ భారత్‌లో తన మొదటి మ్యాచ్ ఆడబోతున్న వేళ, ఓపెనింగ్ జోడీలో మార్పులు చేయాలని మాజీ వికెట్ కీపర్ దీప్ దాస్‌గుప్తా టీమిండియా మేనేజ్‌మెంట్‌కు కీలక సూచన చేశాడు.
సంజూ శాంసన్ – వైభవ్ కాంబినేషన్ అదుర్స్:
భారత టీ20 జట్టులో ప్రస్తుతం అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్‌లతో పాటు ఇషాన్ కిషన్ రూపంలో నలుగురు ఓపెనింగ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన దాస్‌గుప్తా, ఇప్పటివరకు అభిషేక్ – వైభవ్, అభిషేక్ – సంజు కాంబినేషన్లను మాత్రమే చూశాం, ఇంకా సంజు – వైభవ్ జోడీని పరీక్షించలేదని పేర్కొన్నాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో సిరీస్‌లో సంజు శాంసన్‌ను వైభవ్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించేలా చేస్తే ఈ కాంబినేషన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో క్లారిటీ వస్తుందని అభిప్రాయపడ్డాడు.
అభిషేక్‌ను పక్కన పెట్టడం కాదు:
ఈ సరికొత్త కాంబినేషన్ సూచనపై వివరణ ఇస్తూ, అభిషేక్ శర్మను జట్టు నుంచి తొలగించాలని తాను అనడం లేదని దాస్‌గుప్తా స్పష్టం చేశాడు. రాబోయే టీ20 ప్రపంచకప్‌కు ముందు అందుబాటులో ఉన్న ప్రతి ఆటగాడికి, అన్ని కాంబినేషన్లకు తగినంత అవకాశం ఇవ్వడమే ప్రధాన లక్ష్యం.. మెగా టోర్నీకి ముందు జట్టుకు ఏ జోడీ బాగా సెట్ అవుతుందో అర్థం చేసుకోవడానికి, ఆటగాళ్లకు తగినంత మ్యాచ్ టైమ్ ఇవ్వడానికి ఇలాంటి ప్రయోగాలు ఎంతగానో ఉపయోగపడతాయని వెల్లడించాడు.
ALSO READ : రేపే భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య బిగ్ ఫైట్..
రైట్ – లెఫ్ట్ కాంబినేషన్ అడ్వాంటేజ్:
మరోవైపు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ ముగ్గురూ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు కావడం గమనార్హం. కుడిచేతి వాటం బ్యాటర్ అయిన సంజు శాంసన్‌ను ఓపెనర్‌గా పంపడంతో జట్టుకు రైట్ – లెఫ్ట్ ఓపెనింగ్ కాంబినేషన్ అడ్వాంటేజ్ కూడా దక్కుతుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మేనేజ్‌మెంట్ జింబాబ్వే సిరీస్ హీరో వైభవ్ పక్కన సంజు శాంసన్‌ను దించుతుందా లేక పాత ఓపెనింగ్ జోడీకే ప్రాధాన్యత ఇస్తుందా అనేది ఇప్పుడు తీవ్ర ఆసక్తికరంగా మారింది.