Reading Time: 2 minutes

యూఎస్‌‌ ఓపెన్‌: గట్టెక్కిన జ్వెరెవ్.. రెండో రౌండ్లోకి ప్రవేశం

Caption of Image.

న్యూయార్క్‌‌: జర్మనీ స్టార్‌‌ ప్లేయర్‌‌, టాప్‌‌సీడ్‌‌ అలెగ్జాండర్‌‌ జ్వెరెవ్‌‌.. యూఎస్‌‌ ఓపెన్‌‌ గ్రాండ్‌‌స్లామ్‌‌ టోర్నీలో చెమటోడ్చి గట్టెక్కాడు.  మంగళవారం అర్ధరాత్రి జరిగిన మెన్స్‌‌ సింగిల్స్‌‌ తొలి రౌండ్‌‌లో జ్వెరెవ్‌‌ 6–4, 3–6, 6–7 (7/9), 7–5, 6–4తో లోరెంజో సోనెగో (ఇటలీ)పై గెలిచి రెండో రౌండ్‌‌లోకి ప్రవేశించాడు.

జూన్‌‌లో ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌ గెలిచిన జర్మన్‌‌ ప్లేయర్‌‌ మేజర్‌‌ చాంపియన్‌‌గా యూఎస్‌‌ ఓపెన్‌‌ను మొదలుపెట్టాడు. కానీ 4 గంటల 53 నిమిషాల మ్యాచ్‌‌లో సోనెగో నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొన్నాడు. తొలి సెట్‌‌ను గెలుచుకునే క్రమంలో ఏడు బ్రేక్‌‌ పాయింట్‌‌ అవకాశాల్లో ఒకదాన్ని మాత్రమే సద్వినియోగం చేసుకున్నాడు.

అయితే రెండో సెట్‌‌ ఆరంభంలోనే సోనెగో బలమైన సర్వీస్‌‌లతో బ్రేక్‌‌ పాయింట్ సాధించాడు. తర్వాత స్కోరును సమం చేసి అద్భుతమైన ఏస్‌‌తో సెట్‌‌ను సొంతం చేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన మూడో సెట్‌‌ టైబ్రేక్‌‌కు దారి తీయగా, జ్వెరెవ్‌‌ చేసిన డబుల్‌‌ ఫాల్ట్‌‌ వల్ల సోనెగో 2–1 ఆధిక్యంలో నిలిచాడు.

అక్కడినుంచి వరుస పాయింట్లతో హోరెత్తించాడు. నాలుగో సెట్‌‌లో ఇద్దరూ బ్రేక్‌‌ పాయింట్లు సాధించడంతో గేమ్‌‌ రసవత్తరంగా సాగింది. ఓటమికి రెండు పాయింట్ల (4–5) దూరంలో నిలిచిన జ్వెరెవ్‌‌ 30–30 స్కోరు వద్ద సోనెగో సర్వీస్‌‌ను బ్రేక్‌‌ చేసి సెట్‌‌ను సొంతం చేసుకున్నాడు. ఇక నిర్ణయాత్మక ఐదో సెట్‌‌లో సోనెగో అలసిపోవడం జ్వెరెవ్‌‌కు కలిసొచ్చింది. తన సర్వీస్‌‌లను నిలబెట్టుకోవడంతో పాటు రెండుసార్లు ఇటలీ ప్లేయర్‌‌ సర్వ్‌‌ను బ్రేక్‌‌ చేసి చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

ఇతర మ్యాచ్‌‌ల్లో టేలర్‌‌ ఫ్రిట్జ్‌‌ (అమెరికా) 6–3, 6–2, 6–4తో డార్విన్‌‌ బ్లాంచ్‌‌ (అమెరికా)పై, కోబలి (ఇటలీ) 3–6, 2–6, 6–3, 6–4, 6–4తో ఫ్రాన్సిస్కో కొమెసనా (అర్జెంటీనా)పై, గేల్‌‌ మోన్‌‌ఫీల్స్‌‌ (ఫ్రాన్స్‌‌) 2–6, 6–1, 6–2, 6–0తో అడాల్ఫో డానియెల్‌‌ వాలెజో (పరాగ్వే)పై, ముసెట్టీ (ఇటలీ) 6–3, 6–3, 7–5తో పెరీ (ఆస్ట్రేలియా)పై, సెరుండోల్‌‌ (అర్జెంటీనా) 6–4, 6–3, 7–5తో ఫిలిప్‌‌ మిసోలిక్‌‌ (ఆస్ట్రియా)పై గెలిచి రెండో రౌండ్‌‌లోకి ప్రవేశించారు. 

రిబకినా, గాఫ్‌‌ ముందంజ

విమెన్స్‌‌ సింగిల్స్‌‌ తొలి రౌండ్‌‌లో రెండోసీడ్‌‌ ఎలినా రిబకిన (కజకిస్తాన్‌‌) 6–3, 6–2తో థియా ఫ్రోడిన్‌‌ (అమెరికా)పై, కోకో గాఫ్‌‌ (అమెరికా) 6–3, 6–4తో జైనప్‌‌ సోన్మెజ్‌‌ (టర్కీ)పై, మాడిసన్‌‌ కీస్‌‌ (అమెరికా) 7–5, 6–4తో కోర్నివా (రష్యా)పై, ఆండ్రీవా (రష్యా) 6–2, 6–2తో జెనికా జెన్‌‌ (ఇండోనేసియా)పై, అలెక్స్‌‌ ఈలా (ఫిలిప్పీన్స్‌‌) 6–1, 6–2తో స్టోయానా (అమెరికా)పై, పుతినెత్సోవా (ఉక్రెయిన్‌‌) 4–6, 7–5, 6–3తో బెనిసిచ్‌‌ (కెనడా)పై, అనాస్టాసియా పొటపోవా (ఆస్ట్రియా) 6–2, 6–2తో డార్జా సెమెనిస్టజా (లాత్వియా)పై, బౌజస్‌‌ మనెరియో (స్పెయిన్‌‌) 6–3, 6–4తో విడమనోవా (చెక్‌‌)పై, సక్కారి (గ్రీస్‌‌) 2–6, 7–5, 6–2తో మెంటాగోమెరి (అమెరికా)పై, మార్టెన్స్‌‌ (జర్మనీ) 6–4, 6–4తో క్వియోవెడో (స్పెయిన్‌‌)పై గెలిచి రెండో రౌండ్‌‌లోకి అడుగుపెట్టారు.

©️ VIL Media Pvt Ltd.