Reading Time: < 1 minute
Tata Chemicals Kenya Why President William Ruto Ordered The Company To Stop Operations

Tata Chemicals: టాటా కెమికల్స్‌కు కెన్యా అధ్యక్షుడు విలియం రూటో షాక్ ఇచ్చారు. కెన్యాలోని లేక్ మగాడి ప్రాంతంలో టాటా కెమికల్స్ కార్యకలాపాలు నిలిపేయాలని ఆదేశించారు. ఇక్కడి వనరుల్ని ఉపయోగించుకుంటున్నప్పటికీ, స్థానికులకు సరైన ఉపాధి, ఉద్యోగ, పారిశ్రామికాభివృద్ధి కల్పించడం లేదని రూటో ఆరోపించారు. టాటాకు సుమారు 100 ఏళ్ల కాంట్రాక్ట్ ఉన్నప్పటికీ, కాజియాడోలో పెద్ద పరిశ్రమ ఏర్పాటు చేయలేదని విమర్శించారు. ‘‘మనం ఇతరులకు బానిసలమా.?’’ అంటూ ప్రశ్నించారు. లేక్ మగాడి నుంచి వనరుల్ని ఇతర దేశాలకు తరలించడం కాకుండా, వాటిని కెన్యాలో ప్రాసెస్ చేసి స్థానికంగా ఉద్యోగాలు, పెట్టుబడులు, పరిశ్రమలకు ఉపయోగించాలని రూటో స్పష్టం చేశారు.

ఇదే సమయంలో టాటా కెమికల్స్‌ స్థానంలో కొత్త పరిశ్రమల్ని తీసుకురావాలని కెన్యా ప్రభుత్వం భావిస్తోంది. కొత్త కంపెనీ కాజియాడోలోనే తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేయాలని రూటో తెలిపారు. ఒక సంస్థ గ్లాస్ తయారీ పరిశ్రమను, మరో సంస్థ కెమికల్స్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు.లేక్ మగాడిలో టాటా కెమికల్స్ కార్యకలాపాలు 1911లో ‘మగాడి సోడా కంపెనీ’గా ప్రారంభమైంది. 2005లో టాటా కెమికల్స్ ఈ సంస్థను సొంతం చేసుకుంది.

లేక్ మగాడిలోని ట్రోనా ఖనిజాన్ని వెలికితీసి సహజ సోడా యాష్‌ను ఉత్పత్తి చేస్తోంది. గాజు, డిటర్జెంట్లు, కెమికల్స్ తయారీతో పాటు నీటి శుద్ధిలోనూ సోడా యాష్‌ను ఉపయోగిస్తారు. ఈ కార్యకలాపాలు కెన్యా నుంచి పెద్ద ఎత్తున ఎగుమతులకు కూడా దోహదపడుతున్నాయి. కెన్యా ప్రభుత్వం జూలై 28 నుంచి సంస్థ మైనింగ్ కార్యకలాపాలను సస్పెండ్ చేసింది. టాటా కెమికల్స్ మాత్రం తాము ప్రభుత్వం కోరిన సమాచారాన్ని, పత్రాలను అందించామని, నిబంధనలకు అనుగుణంగా ఉన్నామన్నారు.

రూటో నిర్ణయంపై కెన్యా ప్రతిపక్ష పార్టీ ‘‘డెమోక్రసీ ఫర్ ది సిటిజన్ పార్టీ(డీసీపీ)’’ తీవ్రంగా వ్యతిరేకించింది. టాటా కెమికల్స్ మూసివేత వల్ల మగాడి ప్రాంతంలో ప్రత్యక్షంగా,పరోక్షంగా వేలాది మంది ఉపాధిపై ప్రభావం పడుతుందని చెప్పింది. మగాది ప్రాంతంలో భారీ లిథియం నిల్వలు, చమురు అన్వేషన అవకాశాలు ఉన్నాయని డీసీపీ చెప్పింది. టాటా కెమికల్స్‌ను అక్కడి నుంచి పంపించి, ఆ వనరుల్ని వేరే వారికి అప్పగించాలని ప్రయత్నిస్తోందని ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించింది.