
మెగాస్టార్ చిరంజీవితో నాని నిర్మాణంలో శ్రీకాంత్ ఓదెల సినిమా చేయబోతున్నారన్న అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ‘ప్యారడైజ్’ తర్వాత వెంటనే మెగా ప్రాజెక్ట్ మొదలవుతుందా అంటే దర్శకుడి నుంచి భిన్నమైన సమాధానం వచ్చింది. ‘ప్యారడైజ్’ రిలీజ్ అయ్యాక తన మెదడుకు విశ్రాంతి కావాలని, దాదాపు మూడు నెలల పాటు ఏ పనీ చేయకుండా ఇంట్లో ఖాళీగా ఉండబోతున్నానని శ్రీకాంత్ కుండబద్దలు కొట్టారు.
చిరంజీవిగారికి కూడా ఇదే విషయం ముందే చెప్పానని, అంతవరకు ఆయన వేరే సినిమా చేసుకుంటారా లేక వేచి చూస్తారా అనేది వారి నిర్ణయమని వ్యాఖ్యానించడం సినీ వర్గాల్లో ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ విరామం తర్వాతే చిరంజీవి ప్రాజెక్టుపై కూర్చుంటానని, ఆ సినిమా నూటికి నూరు శాతం ఖచ్చితంగా ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. ప్రస్తుతం తన దృష్టంతా పూర్తిగా ‘ప్యారడైజ్’ సినిమాపైనే ఉందని, ఇందులో నానితో పాటు సంపూర్ణేష్ బాబు ఒక డిఫరెంట్ రోల్‌లో కనిపించనున్నారని వెల్లడించారు.