Reading Time: 2 minutes

గ్రాండ్ వెడ్డింగ్ కోసం రూ.45 లక్షలు లోన్ తీసుకోమంటున్న పేరెంట్స్.. డైలమాలో పెళ్లికొడుకు!

Caption of Image.

పెళ్లి అనగానే మన దేశంలో పెద్దల కోరిక మేరకు భారీ ఖర్చులు, వేలాది మంది అతిథులు, రోజుల తరబడి జరిగే వేడుకలు కళ్ల ముందు కదలాడతాయి. ఈ గ్రాండ్ వెడ్డింగ్ కల్చర్ ఇప్పుడు కొందరికి తీరని ఆర్థిక భారాన్ని మోపుతోంది. సరిగ్గా ఇలాంటి ఘటనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేవలం పెళ్లి కోసం ఏకంగా రూ.45 లక్షలు పర్సనల్ లోన్ తీసుకోవాలంటూ తల్లిదండ్రులు పెడుతున్న ఒత్తిడితో ఓ 27 ఏళ్ల యువకుడు బిగ్‌ టెన్షన్‌లో పడిపోయాడు. జీవితాన్ని సరిగ్గా ప్రారంభించాల్సిన సమయంలో ఈ అప్పుల ఊబిలోకి దిగితే తన భవిష్యత్తు అంధకారం అవుతుందని ఆందోళన చెందుతున్నాడు.

రెడ్దిట్‌లోని ‘r/IndiaFinance’ వేదికగా ఈ యువకుడు తన గోడు వెళ్లబోసుకున్నాడు. కులాంతర వివాహం కావడంతో ఎట్టకేలకు తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించారు కానీ.. షరతులు పెట్టారని చెప్పాడు. సమాజంలో తమ హోదా కోసం దాదాపు 1,500 మంది అతిథులతో పెళ్లి అట్టహాసంగా జరగాలని పట్టుబట్టారట. ఇందుకోసం రూ.50 లక్షల వరకు ఖర్చవుతుందని, మరో రూ.10 లక్షల విలువైన కారు కూడా కొనాలని పేరెంట్స్ ప్రెజర్ చేస్తున్నారన్నాడు కుర్రోడు. ఇప్పటికే తండ్రి పేరిట రూ.50 లక్షల అప్పు ఉండగా, దాన్ని తీర్చేందుకు ఉన్న భూమి అమ్మాల్సిన పరిస్థితి వచ్చిందట. ఈ పరిస్థితుల్లో కొడుకు పేరిట రూ.45 లక్షల పర్సనల్ లోన్ తీసుకుని పెళ్లి చేయాలని పేరెంట్స్ అనటంపై నెటిజన్లు కూడా సీరియస్ అవుతున్నారు.

కాబోయే భార్య కుటుంబం కేవలం రూ.15 లక్షలతో పెళ్లి చేద్దామని ముందుకొచ్చినా.. అబ్బాయి తల్లిదండ్రుల పంతం ముందు అది వీలుపడలేదు. పెళ్లయిన తర్వాత తమ ఇద్దరి సంపాదన కలిపి నెలకు రెండున్నర లక్షల రూపాయలు వస్తుందని, అప్పును తాము తీరుస్తామని కాబోయే భార్య చెబుతున్నప్పటికీ.. యువకుడు మాత్రం భయపడిపోతున్నాడు. ఎక్కువ వడ్డీ ఉండే పర్సనల్ లోన్‌తో వైవాహిక జీవితాన్ని ప్రారంభిస్తే అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయమని అంటున్నాడు. కేవలం బంధువులు, నలుగురిలో గొప్ప కోసం రూ.45 లక్షల అప్పు నెత్తికెక్కించుకోవడం ఆర్థిక ఆత్మహత్యతో సమానమని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

ALSO READ : జనం దగ్గర డిపాజిట్లకు పైసల్లేవ్.. కానీ అప్పుల కోసం మాత్రం ఎగబడుతున్నరు!

ఈ పోస్ట్‌పై నెటిజన్లు కూడా అదే స్థాయిలో స్పందించారు. “అప్పుల ఊబిలోకి వెళ్తున్నావు, పొరపాటున కూడా లోన్ తీసుకోవద్దు” అంటూ హెచ్చరిస్తున్నారు. పెళ్లి అనేది ఒక్కరోజో.. రెండు రోజులో జరిగే తంతు అని, దానికోసం జీవితాంతం అప్పులు కడుతూ బతకడం తెలివిలేని పని అంటూ కొందరు సలహాలు ఇస్తున్నారు. కొందరైతే కేవలం కొద్ది మంది బంధువులతో సింపుల్‌గా పెళ్లి ముగించుకోవాలని సూచించారు. ఏది ఏమైనా.. నేటి యువత కోరుకునే ఆర్థిక స్థిరత్వానికి, పాతకాలపు పెద్దల ఆర్భాటాల ఆలోచనలకు మధ్య నలుగిపోతున్న ఈ యువకుడి జీవితం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

©️ VIL Media Pvt Ltd.