
ఆంధ్రప్రదేశ్‌లో రాగల రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ వంటి పలు కోస్తా జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వాతావరణ మార్పులే అని అధికారులు తెలిపారు.
మరికొద్ది గంటల్లో ఉత్తర అండమాన్ సముద్రంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ అల్పపీడనం క్రమక్రమంగా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా పయనించనుంది. ఈనెల 23 లేదా 24వ తేదీ నాటికి ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఈ వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా లేదా తుఫానుగా రూపాంతరం చెందే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఈ తుఫాను ఉత్తర కోస్తా – దక్షిణ ఒడిస్సా మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ వాతావరణ మార్పుల ప్రభావంతో రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు మరింత పుంజుకోనున్నాయి. కోస్తా తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రైతులు కూడా తమ వ్యవసాయ పనుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. వర్షాల తీవ్రతను బట్టి యంత్రాంగం ముందస్తు చర్యలు చేపడుతోంది.