Reading Time: 2 minutes

వన్డేల్లో పంత్‌ ఆడటం ఇక కష్టమే.. భారత జట్టు సెలెక్షన్‌పై మాజీ క్రికెటర్ వ్యాఖ్యలు వైరల్!

Caption of Image.

Rishabh Pant ODI Future: భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ వైట్ బాల్ కెరీర్‌పై సెలెక్టర్లు ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చేశారని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా బాంబు పేల్చాడు. రాబోయే వెస్టిండీస్ వన్డే సిరీస్ నుంచి పంత్‌ను తప్పించడం, అదే సమయంలో ఇరానీ కప్ కోసం రెస్ట్ ఆఫ్ ఇండియా (ROI) కెప్టెన్‌గా ప్రకటించడం వెనుక ఉన్న అసలు నిజాలను జియోస్టార్ (JioStar) వేదికగా విశ్లేషించాడు.

ఆడకుండానే గుడ్ బై చెప్పేశారు: 

రిషభ్ పంత్ కేసు చాలా విచిత్రమైనది.. టెస్ట్ క్రికెట్‌లో అతడు టీమిండియాకు అత్యంత కీలకమైన ఆటగాడు (వైస్ కెప్టెన్సీ పోయినప్పటికీ).. కానీ వన్డే క్రికెట్ విషయానికి వస్తే మాత్రం.. అసలు మ్యాచ్‌లు ఆడకుండానే సెలెక్టర్లు అతడికి గుడ్ బై చెప్పేశారని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. రెడ్ బాల్ క్రికెట్‌లో పంత్ సేవలను వాడుకోవాలని భావిస్తున్న సెలెక్షన్ కమిటీ, వైట్ బాల్ క్రికెట్‌లో మాత్రం అతడికి డోర్స్ క్లోజ్ చేసినట్లే కనిపిస్తోందన్నాడు. గడిచిన నాలుగేళ్లలో పంత్ ఆడింది కేవలం ఒకే ఒక్క వన్డే కాగా, 2024 టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత పొట్టి ఫార్మాట్ జట్టులోనూ అతడు స్థానం కోల్పోయాడు.

వరల్డ్ కప్ 2027 ప్లాన్స్.. గిల్ కెప్టెన్: 

2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ ప్రణాళికలు వేస్తోందని ఆకాష్ చోప్రా తెలిపాడు. విండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌కు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు జట్టులో కొనసాగుతున్నారు. శ్రేయస్ అయ్యర్ ఆసియా గేమ్స్ లో టీ20 జట్టుకి కెప్టెన్ గా ఉండటంతో కేఎల్ రాహుల్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఇక పంత్ లేకపోవడంతో ధ్రువ్ జురెల్ కీపింగ్ ఆప్షన్‌గా రేసులోకి వచ్చాడు.

జైస్వాల్ vs గైక్వాడ్.. ఆకిబ్ నబీపై నజర్: 

భారత జట్టులో రిజర్వ్ ప్లేయర్ల కోసం తీవ్ర పోటీ నెలకొందని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.

* రేసులో ఓపెనర్లు: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్‌ల మధ్య విండీస్ సిరీస్‌లో తీవ్ర పోటీ ఉంటుందని, వీరికి వచ్చిన అవకాశాలను మిస్ చేసుకోకూడదని చూస్తున్నారు.  

* ఆకిబ్ నబీ ఎంట్రీ: సుదీర్ఘకాలంగా బెంచ్‌కే పరిమితమైన పేస్ బౌలర్ ఆకిబ్ నబీకి ప్లేయింగ్ ఎలెవన్ లో అవకాశం వస్తే చూడాలని ఉంది. 

* భారత్, వెస్టిండీస్ మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ సెప్టెంబర్ 27న తిరువనంతపురంలో ప్రారంభం కానుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 30న గౌహతిలో రెండో వన్డే, అక్టోబర్ 3న న్యూ చండీగఢ్‌లో ఆఖరి వన్డే జరగనున్నాయి.

©️ VIL Media Pvt Ltd.