
అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి సామూహిక కాల్పుల ఘటన కలకలం రేపింది. వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్ నగరంలో నిర్వహిస్తున్న ప్రముఖ ‘బైట్ ఆఫ్ సియాటెల్’ ఫుడ్ ఫెస్టివల్‌లో దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా… మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన నగరంలోని ప్రసిద్ధ స్పేస్ నీడిల్ సమీపంలో చోటుచేసుకుంది. ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సియాటెల్ మేయర్ కార్యాలయం వెల్లడించింది.
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఒకరు కాల్పులు జరిపినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలం నుంచి రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఒక అనుమానితుడిని అరెస్ట్ చేసినప్పటికీ, మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది. సియాటెల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో స్పందిస్తూ.. ‘సియాటెల్ సెంటర్‌లో కాల్పులు జరిగాయి. పలువురు బాధితులు ఉన్నారు. ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్లకుండా ఉండాలి. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం.’’ అని తెలిపింది.
స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సియాటెల్ సెంటర్‌లో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో అక్కడ వార్షిక బైట్ ఆఫ్ సియాటెల్ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతోంది. ఈ వేడుకలో వందలాది స్థానిక ఆహార విక్రేతలు, ప్రత్యక్ష సంగీత కార్యక్రమాలు కొనసాగుతుండగా ఒక్కసారిగా కాల్పులు జరగడంతో అక్కడ భయానక పరిస్థితులు నెలకొన్నాయి.
ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియోల్లో ఒక్కసారిగా తుపాకీ శబ్దాలు వినిపించడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం ఏడు నుంచి ఎనిమిది రౌండ్ల కాల్పులు జరిగినట్లు తెలిపారు. కాల్పుల శబ్దం వినిపించగానే ప్రజలు అన్ని వైపులా పరుగులు తీశారని చెప్పారు.
25 ఏళ్ల ప్రత్యక్ష సాక్షి ఎస్టాన్ వాకోనాబో మాట్లాడుతూ.. ఫుడ్ ఫెస్టివల్‌కు భారీ సంఖ్యలో ప్రజలు రావడంతో అప్పటికే అక్కడ కిక్కిరిసిన పరిస్థితి ఉందని చెప్పారు. కాల్పులు ప్రారంభమైన వెంటనే ప్రజలు ఒకరినొకరు తోసుకుంటూ పరుగులు తీయడంతో తొక్కిసలాట చోటుచేసుకుందని తెలిపారు. తర్వాత తిరిగి ఘటనాస్థలానికి వెళ్లిన ఆయన.. పలువురు గాయాలతో నేలపై పడిఉండడాన్ని, అలాగే ఒక మృతదేహాన్ని పసుపు రంగు వస్త్రంతో కప్పి ఉంచిన దృశ్యాన్ని చూసినట్లు వెల్లడించారు.
1982 నుంచి కొనసాగుతున్న ఫెస్టివల్
బైట్ ఆఫ్ సియాటెల్ ఫుడ్ ఫెస్టివల్ 1982లో ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవానికి సుమారు 3.5 లక్షల మంది హాజరవుతుంటారు. ఆహారం, పానీయాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ వేడుకకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే ఈసారి జరిగిన కాల్పుల ఘటనతో ఫెస్టివల్ విషాదంలో ముగిసింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
BREAKING: New video shows the moment when people fleeing the Seattle Center in Washington state.
Reports of multiple gunshot victims in the area.
Livestream: Hawaiian Honey Cones. pic.twitter.com/8evoOeIQYK
— P (@PhanPhan1000) July 27, 2026
BREAKING: New video shows the moment when people fleeing the Seattle Center in Washington state.