Reading Time: < 1 minute
Sikandar Raza Reaction After Ind Vs Zim T20i Series

భారత్‌తో జరిగిన టీ20 సిరీస్ అనంతరం జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా తమ జట్టు ప్రదర్శన, భవిష్యత్ ప్రణాళికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్‌ను నిర్వహించిన జింబాబ్వే క్రికెట్ బోర్డుకు ఆయన ముందుగా ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి జట్లతో ఆడితేనే ఏ జట్టు అయినా అభివృద్ధి చెందుతుందని, అత్యుత్తమ ప్రదర్శనతో క్రికెట్ మరింత వినోదాత్మకంగా మారుతుందని రజా అభిప్రాయపడ్డాడు. ప్రపంచ క్రికెట్‌లోని అగ్ర జట్లకు, తక్కువ ర్యాంకింగ్ ఉన్న జట్లకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించడానికి భారత్‌తో జరిగిన ఈ మ్యాచ్‌ల అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుందని స్పష్టం చేశాడు.

ఈ సిరీస్ ద్వారా జట్టుకు ఎన్నో సానుకూల అంశాలు లభించాయని రజా తెలిపాడు. యువ ఆటగాడు న్యూమన్ న్యామ్‌హురి రూపంలో మంచి ప్రతిభావంతుడైన బౌలర్ దొరికాడని, లోయర్ ఆర్డర్‌లో మరుమాని, అలాగే మధెవెరె మంచి పరుగులతో ఆకట్టుకున్నారని మెచ్చుకున్నాడు. తమ డ్రెస్సింగ్ రూమ్ సంస్కృతిలో మార్పులు తెచ్చేందుకు కొద్దికాలంగా కృషి చేస్తున్నామని, ఒకరి విజయంలో మరొకరం భాగస్వామ్యం అవుతూ, ఓటమి సమయంలోనూ అండగా నిలుస్తున్నామని పేర్కొన్నాడు. మైదానంలో ప్రతి బంతికి పూర్తి కట్టుబాటుతో, పట్టుదలతో ఆడటమే తమ లక్ష్యమని, అంతర్జాతీయ స్థాయికి తగినట్టుగా తమ ప్రమాణాలను పెంచుకుంటున్నామని వెల్లడించాడు.

ఇక సొంత ప్రదర్శనపై స్పందించిన సికందర్ రజా, ఈ సిరీస్‌లో తాను పరుగులు చేయలేకపోవడంపై కొద్దిగా అసంతృప్తి వ్యక్తం చేశాడు. “త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కునేందుకు (నవ్వుతూ) ప్రయత్నిస్తాను” అని వ్యాఖ్యానించిన రజా, తాను పరుగులు చేయకపోయినా జట్టు సభ్యులు బాధ్యతాయుతంగా రాణించడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని అన్నాడు. ఒక నాయకుడిగా ముందుండి నడిపించడంలో ఎక్కడ వెనుకబడ్డానో తనకు తెలుసని, దాన్ని సరిదిద్దుకుంటానని ధీమా వ్యక్తం చేశాడు. త్వరలో నమీబియాతో జరగబోయే ముక్కోణపు సిరీస్‌లో తాను మళ్లీ ఫామ్‌లోకి వచ్చి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తానని, ఆ రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయని రజా ఆశాభావం వ్యక్తం చేశాడు.