Reading Time: < 1 minute
Cm Revanth Reddy Comments On Pm Modi Youth Politics

ప్రధాని నరేంద్ర మోడీకి చెందిన ’56 అంగుళాల ఛాతీ’ మళ్లీ యువశక్తి ముందు లొంగిపోయిందని, కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల నిరసన దెబ్బకు తలవంచక తప్పలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నాడు సుదీర్ఘ పోరాటంతో రైతులు నల్ల చట్టాలను రద్దు చేయిస్తే, నేడు విద్యార్థుల ఆగ్రహంతో కేంద్ర విద్యాశాఖే విఫలమైందని విమర్శించారు. నీట్ (NEET) వివాదంలో నష్టపోయిన బాధితులందరికీ తక్షణమే న్యాయం చేయాలని, నిరసన తెలిపిన విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ‘జై జవాన్, జై కిసాన్’ నినాదానికి జోడిగా ఇకపై ‘జై యువా’ నినాదం బలంగా వినిపిస్తుందని, ఈడీ, సీబీఐ, ఐటీ బెదిరింపులకు నేటి యువత ఎంతమాత్రం భయపడదని స్పష్టం చేశారు.

 

యువతకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచేందుకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే వయోపరిమితిని తగ్గించాలని కోరుతూ రాబోయే ఆగస్టు నెల ఉభయ సభల సమావేశాల్లో తెలంగాణ అసెంబ్లీ వేదికగా ప్రత్యేక తీర్మానం చేస్తామని సీఎం ప్రకటించారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల కనీస వయస్సును 21 ఏళ్లకు, అలాగే ఎమ్మెల్సీ, రాజ్యసభ అభ్యర్థుల వయస్సును 25 ఏళ్లకు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్రం రాబోయే రోజుల్లో తీసుకరాబోయే నియోజకవర్గాల డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లతో పాటుగా ఈ పోటీ వయోపరిమితి తగ్గింపు బిల్లును కూడా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.