Reading Time: 2 minutes
Ishan Kishan Reveals Team Indias Plan To Protect Vaibhav Sooryavanshi From Social Media Distractions

Ishan Kishan on Vaibhav Sooryavanshi: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని టీమిండియా ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తోంది. జింబాబ్వేతో తొలి టీ20లో కేవలం 18 బంతుల్లోనే అర్ధశతకం బాది ప్రపంచ రికార్డు సృష్టించిన వైభవ్.. రెండో మ్యాచ్‌లో మాత్రం 9 బంతుల్లో 20 పరుగులు చేసి అవుటయ్యాడు. అయితే ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా.. పూర్తిగా తన ఆటపైనే దృష్టి పెట్టేలా జట్టు సీనియర్ ఆటగాళ్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ వెల్లడించాడు.

వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు:

రెండో టీ20లో 44 బంతుల్లో 81 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ కిషన్.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైభవ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘వైభవ్ చాలా తెలివైన ఆటగాడు. ఎలా బ్యాటింగ్ చేయాలో, మైదానంలో ఎలా ప్రవర్తించాలో, మైదానం బయట ఎలా ఉండాలో అతనికి బాగా తెలుసు. కానీ అతను వచ్చిన నేపథ్యం కారణంగా చుట్టూ ఎన్నో ఆకర్షణలు, దృష్టి మళ్లించే అంశాలు ఉంటాయి. నేను కూడా అదే పరిస్థితుల నుంచి వచ్చాను కాబట్టి వాటి ప్రభావం ఎలా ఉంటుందో నాకు తెలుసు’ అని ఇషాన్ తెలిపాడు.

బయట విషయాలు పట్టించుకోవద్దని సూచిస్తున్నాం:

వైభవ్ సోషల్ మీడియా, బయట జరుగుతున్న ప్రచారం గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉండేలా భారత జట్టు ప్రయత్నిస్తోందని ఇషాన్ కిషన్ వెల్లడించాడు. ‘నేను మాత్రమే కాదు.. అభిషేక్ శర్మ, అక్షర్ పటేల్, జట్టులోని ఇతర సీనియర్ ఆటగాళ్లు కూడా వైభవ్‌తో మాట్లాడేటప్పుడు ఒకే విషయాన్ని చెబుతున్నాం. ప్రస్తుతం అతను పూర్తిగా క్రికెట్‌పైనే దృష్టి పెట్టాలి. సోషల్ మీడియాలో ఏమి జరుగుతోంది, బయట ఎవరు ఏమంటున్నారు అనే విషయాలు పట్టించుకోవద్దని సూచిస్తున్నాం. ఒకవేళ పరుగులు చేయకపోయినా నిరాశ చెందకుండా ఉండాలని ఎప్పుడూ చెబుతుంటాం’ అని పేర్కొన్నాడు.

చిన్న వయసులోనే తప్పుదారి పట్టకూడదు:

వైభవ్ అసాధారణ ప్రతిభ కలిగిన ఆటగాడని ఇషాన్ కిషన్ ప్రశంసించాడు. ‘వైభవ్ లాంటి బ్యాటర్ పవర్‌ప్లేలో క్రీజులో ఉంటే తొలి ఆరు ఓవర్లలోనే జట్టు స్కోరు 80 నుంచి 90 పరుగులకు వెళుతుంది. అలాంటి ప్రతిభావంతుడైన ఆటగాడు చిన్న వయసులోనే తప్పుదారి పట్టకూడదు. అందుకే మేమంతా అతనికి అన్నల్లా అండగా నిలుస్తున్నాం. మేము మా కెరీర్ ప్రారంభంలో చేసిన తప్పులను అతను చేయకుండా చూసుకోవడమే మా బాధ్యత. మానసికంగా, శారీరకంగా సరైన దారిలో ముందుకు వెళ్లేలా సహాయం చేస్తున్నాం. వైభవ్ ఎప్పుడూ సంతోషంగా క్రికెట్ ఆడుతూ తన ఆటను ఆస్వాదించాలని కోరుకుంటున్నాం’ అని ఇషాన్ చెప్పుకొచ్చాడు.