Reading Time: < 1 minute
Chandrababu Naidu Kurnool Tour Rayalaseema Development Projects

కర్నూలు జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రాయలసీమ ప్రగతి, తీవ్రమవుతున్న ఆర్థిక, నీటి సంక్షోభాలపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. రాయలసీమను ‘రత్నాల సీమ’గా మారుస్తామని సీఎం ఆకాంక్షించారు. వేదవతి ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసి, హంద్రీ-నీవా నుంచి నీటిని లిఫ్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. జొన్నగిరి గోల్డ్ మైనింగ్‌తో దానికి ‘స్వర్ణగిరి’గా పేరు మార్చామని, 2028 మార్చి నాటికి ‘రాయలసీమ స్టీల్స్’ అందుబాటులోకి తెస్తామని తెలిపారు. పుట్టపర్తి కేంద్రంగా యుద్ధ విమానాల తయారీ పరిశ్రమను తీసుకొస్తామని, అలాగే రాయలసీమను రూ. లక్ష కోట్లతో ‘హార్టికల్చర్ హబ్’గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఈ ఏడాది పోలవరం పనులు పూర్తి చేసి, 2027 మార్చి నాటికి జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు.

ఇరాన్ యుద్ధ పరిణామాల వల్ల గ్యాస్, పెట్రోల్ సరఫరా తగ్గి రాష్ట్ర ఆదాయం పడిపోయిందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం 51 శాతం తగ్గడం వల్ల భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయని చెప్పారు. అందుకే ఈ ఏడాది రైతులు వరి పంట వేయవద్దని, ఆరుతడి పంటలు, పండ్లు, కూరగాయలు సాగు చేయాలని సూచించారు.

స్థానిక సమస్యలు…
ఆలూరు నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడిపై సీఎం ఆరా తీశారు. నీటి సరఫరాలో ఆలూరు 18 శాతం వెనుకబడి ఉందని సభలో ప్రజలు చెప్పగా, సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు. అలాగే.. ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని కోరారు. దంపతులు కూడా ఒకే ఇంట్లో ఉంటూ ఫోన్లకే పరిమితం కావడం సరికాదన్నారు.

రాజకీయ విమర్శలు..
రాష్ట్రంలో ఒక దౌర్భాగ్య పార్టీ ఉందంటూ సీఎం మండిపడ్డారు. బాబాయిని గొడ్డలితో చంపి, ఆ నిందను తనపై వేసేందుకు ప్రయత్నించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో ఎవరు గొడ్డలి ఎత్తినా ఆ చేయి లేకుండా పోతుందని హెచ్చరించారు. తాము అందించే ‘సూపర్ సిక్స్’ పథకాలతో అభివృద్ధి, సంక్షేమం సమతులంగా ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.