
Bank Account: భారత ప్రభుత్వం సామాన్య ప్రజల కోసం ప్రవేశపెట్టిన ‘ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన’ (PMJDY) బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. కేవలం బ్యాంకు ఖాతా తెరవడమే కాకుండా, సామాన్యులకు ఆర్థిక భరోసా కల్పించే అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ఖాతా ఎందుకు అంత ప్రత్యేకమో ఇప్పుడు చూద్దాం:
రూ.10,000 ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం
జన్ ధన్ ఖాతాలోని అత్యంత ముఖ్యమైన ఫీచర్ ఓవర్‌డ్రాఫ్ట్. మీ ఖాతాలో అసలు డబ్బు (జీరో బ్యాలెన్స్) లేకపోయినా, అత్యవసర సమయంలో మీరు రూ.10,000 వరకు బ్యాంకు నుండి తీసుకోవచ్చు. ముందుగా రూ.2,000 వరకు ఎటువంటి నిబంధనలు లేకుండా ఓవర్‌డ్రాఫ్ట్ లభిస్తుంది. అలాగే ఖాతాను కనీసం 6 నెలల పాటు సక్రమంగా నిర్వహించిన వారికి రూ.10,000 వరకు ఈ సౌకర్యం అందుతుంది.
ఉచిత బీమా సౌకర్యం:
ఈ ఖాతా తెరిచిన వారికి ప్రభుత్వం ఉచితంగా బీమా సౌకర్యాన్ని కల్పిస్తుంది. ప్రమాద బీమా (Accident Insurance): ఖాతాతో పాటు ఇచ్చే రూపే (RuPay) డెబిట్ కార్డుపై రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా లభిస్తుంది. జీవిత బీమా సదుపాయం కూడా ఉంది.అర్హత కలిగిన ఖాతాదారులకు రూ.30,000 వరకు జీవిత బీమా కవరేజీ ఉంటుంది.
జీరో బ్యాలెన్స్ ఖాతా:
సాధారణ సేవింగ్స్ ఖాతాల్లో కనీస నిల్వ (Minimum Balance) లేకపోతే బ్యాంకులు జరిమానా విధిస్తాయి. కానీ జన్ ధన్ ఖాతాలో ఎటువంటి బ్యాలెన్స్ లేకపోయినా ఎటువంటి ఛార్జీలు పడవు. ప్రభుత్వ పథకాల నగదు నేరుగా ఖాతాలోకి (DBT) వస్తాయి. గ్యాస్ సబ్సిడీ, రైతు భరోసా, పెన్షన్లు వంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదు నేరుగా ఈ ఖాతాల్లోకే జమ అవుతుంది. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం ఉండదు.
సులభమైన బ్యాంకింగ్ సేవలు:
దేశవ్యాప్తంగా ఎక్కడైనా సులభంగా నగదు బదిలీ చేసుకోవచ్చు. ఖాతాదారులకు ఉచితంగా రూపే డెబిట్ కార్డు (RuPay Debit Card), మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఈ ఖాతా ద్వారా బీమా, పెన్షన్ పథకాలను సులభంగా పొందవచ్చు.
ఖాతా తెరవడానికి అర్హతలు:
- భారతీయ పౌరుడై ఉండాలి.
- కనీసం 10 ఏళ్లు పైబడిన వారు ఎవరైనా ఈ ఖాతా తెరవవచ్చు.
- ఆధార్ కార్డు, ఫోటో ఉంటే సరిపోతుంది. ఒకవేళ ఆధార్ లేకపోతే ప్రభుత్వం గుర్తించిన ఇతర పత్రాలతో ఖాతా ప్రారంభించవచ్చు.
ఇది కూడా చదవండి: Multibagger: అదృష్టం అంటే ఇదేనేమో.. రూ.లక్షకు రూ.14 లక్షలు.. ఇన్వెస్టర్లకు పండగే!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి