Reading Time: 2 minutes
Pat Cummins Reveals Double Bluff Tactic Against Priyansh Arya In Srh Vs Pbks

పాట్ కమిన్స్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ఐపీఎల్ 2026లో అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తోంది. బుధవారం రాత్రి ఉప్పల్ మైదానంలో పంజాబ్ కింగ్స్‌పై 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో టాప్ లేపింది. ఎస్‌ఆర్‌హెచ్ మరో విజయం సాధిస్తే.. దాదాపుగా ప్లేఆఫ్స్ బెర్త్ దక్కుతుంది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ కమిన్స్ జట్టు ప్రదర్శనపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటం సంతోషంగా ఉందని, అయితే ఇంకా టోర్నీలో చాలా దూరం వెళ్లాల్సి ఉందని తెలిపాడు. పంజాబ్ స్టార్ ప్లేయర్ ప్రియాంశ్ ఆర్య కోసం మిడ్ ఆన్ వెనక్కి పంపడం డబుల్ బ్లఫ్ వ్యూహమా అంటే.. ఫీల్డ్ మార్చుతూ ఏదో పెద్ద ప్లాన్ జరుగుతున్నట్టు నటించా అంతే అంటూ కమిన్స్ నవ్వులు పూయించాడు.

‘మ్యాచ్‌లో చాలా విషయాలు మాకు ఆనందం కలిగించాయి. పంజాబ్ కింగ్స్ పటిష్ట జట్టు. ఈ మ్యాచ్‌కు ముందు పట్టికలో పంజాబ్ నంబర్‌వన్‌లో ఉంది. అలాంటి జట్టుపై మేము భారీ స్కోరు చేయడం అద్భుతం. మా బ్యాటర్లు అసాధారణంగా ఆడారు. బౌలర్లు మ్యాచ్‌ను ముగించిన తీరు కూడా చాలా బాగుంది. ఎంత స్కోరు చేసినా.. పంజాబ్ జట్టుపై రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయడం ఎప్పుడూ కష్టం. కానీ మా బౌలర్లు చాలా బాగా బౌలింగ్ చేశారు. మేము మా స్టైల్‌లో ఆడటంలో బాగుంటుంది. ముందుగా బ్యాటింగ్ చేసినప్పుడు రక్షణాత్మకంగా ప్రారంభించాలనే ఆలోచన ఉండదు. అది అభిషేక్ శర్మ, ట్రావిస్ స్టైల్ కాదు. సాధ్యమైనంత ఎక్కువగా స్కోరు చేయాలని చూస్తాం. స్కోర్ గురించి పెద్దగా ఆలోచించం. ఇన్నింగ్స్‌లో పరిస్థితులు మారితే దానికి తగ్గట్టు మార్పులు చేసుకుంటాం’ అని పాట్ కమిన్స్ తెలిపాడు.

‘డే మ్యాచ్‌లలో మాత్రం మేము అంత బాగా ఆడటం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా ఉప్పల్ మైదానంలో మంచి క్రికెట్ ఆడుతున్నాం. ఈ పిచ్ మా ఆటశైలికి సరిపోతుంది. ఈరోజు కూడా పిచ్ కొంచెం గ్రిప్ అయ్యింది. అది మా బౌలర్లకు ఉపయోగపడింది. మ్యాచ్ మధ్యలో పిచ్ ఎలా మారినా.. మేము దానికి తగ్గట్టు ఆడగలమనే నమ్మకం ఉంది. మధ్యాహ్నం మ్యాచ్‌లలో ఎందుకు ఇబ్బంది పడుతున్నామో నాకు తెలియదు. ట్రావిస్ హెడ్ పిల్లలు దగ్గర లేనప్పుడు ఆ సమయానికి ఇంకా నిద్రపోతూ ఉంటాడేమో. నా బౌలింగ్‌పై నేను సంతోషంగా ఉన్నాను. నిజం చెప్పాలంటే నాకు ఈ అవార్డు ఎలా వచ్చిందో ఇంకా తెలియదు. కానీ నేను చాలా ఫ్రెష్‌గా ఫీల్ అవుతున్నాను. మంచి ప్రిపరేషన్‌తో వచ్చాను. జట్టుకు నా వంతు సహకారం అందించడం ఆనందంగా ఉంది’ అని కమిన్స్ చెప్పాడు.

‘పవర్‌ప్లేలో ఏ జట్టు పెద్దగా రన్స్ చేయడం లేదు. అందుకే ఈరోజు మేము కొంచెం ప్రోయాక్టివ్‌గా ఉండాలని అనుకున్నాం. మా దగ్గర కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. పెద్దగా ఆప్షన్స్ లేకపోవడంతో బౌన్సర్ ప్రయత్నించాం. అదృష్టవశాత్తూ అది పనిచేసింది. ప్రియాంశ్ కోసం మిడ్ ఆన్ వెనక్కి పంపడం డబుల్ బ్లఫ్ వ్యూహమా అని చెప్పలేను. ఫీల్డ్ మార్చుతూ ఏదో పెద్ద ప్లాన్ చేసినట్లు నటించాం అంతే. అతడు అవుట్ అయ్యాడు. ఎదో అలా జరిగిపోయింది అంతే. మా దగ్గర చాలా బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ముఖ్యంగా నితీశ్ లాంటి మరో ఆల్‌రౌండర్ ఉండటం ఉపయోగపడుతోంది. పవర్‌ప్లే ఎలా ఉండాలో ముందే క్లియర్ ప్లాన్ పెట్టుకుంటాను. ఆ తర్వాత మాత్రం మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకుంటాను. కనోలీ బాగా ఆడడాన్ని చూడటం సంతోషంగా ఉంది. ఆస్ట్రేలియా ఆటగాళ్లు రాణించడం మంచి విషయం. ఈ సీజన్‌లో అతడు బ్యాట్‌తో స్టార్‌గా నిలిచాడు. ప్రస్తుతం బౌలింగ్ చేయకపోయినా బ్యాటర్‌గా రాణిస్తున్నాడు. ఆస్ట్రేలియా క్రికెట్‌కు ఇది మేలు చేస్తుంది. ఈ సీజన్ అని ఆశిస్తున్నాను. కానీ ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పుడు కొద్దిగా బ్రేక్ దొరికింది. ప్రస్తుతం నంబర్‌వన్‌లో ఉన్న ఆనందాన్ని ఆస్వాదిస్తాం. ఇంకా టోర్నీ చాలానే మిగిలి ఉంది. కానీ ప్రస్తుతం టాప్‌లో ఉండటంకంటే మంచి స్థానం మరొకటి లేదు. చాలా హ్యాపీగా ఉన్నాను’ అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.