Reading Time: 2 minutes
Chanakya Niti Success Secrets Life Lessons Acharya Chanakya

Chanakya Niti: భారతదేశ చరిత్రలో మహా మేధావిగా, గొప్ప రాజనీతిజ్ఞుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తి ఆచార్య చాణక్యుడు. ఈ అపర చాణక్యుడికే కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. ఆయన తన చాణక్య నీతిలో చెప్పిన జీవిత పాఠాలు నేటికీ ఎంతో విలువైనవిగా ఉన్నాయంటే మామూలు విషయం కాదు. ఆయన మౌర్య సామ్రాజ్య స్థాపనలో కీలక పాత్ర పోషించడమే కాకుండా.. రాజనీతి, ఆర్థిక శాస్త్రంపై ఆయన రాసిన ‘అర్థశాస్త్రం’ నేటికీ ఒక అద్భుత గ్రంథంగా చరిత్రలో నిలిచిపోయింది. చంద్రగుప్త మౌర్యుడికి, ఆయన కుమారుడు బిందుసారుడికి ప్రధాన సలహాదారుగా వ్యవహరించిన చాణక్యుడు.. జీవితం, విజయం, అధికారం, స్నేహం గురించి చెప్పిన అద్భుతమైన విషయాలను గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఈ విషయాలను మీరు మీ జీవితంలో పాటిస్తే.. తప్పకుండా విజయం మీ బానిస అవుతుందని పెద్దలు చెబుతున్నారు.

ఈ సందర్భంగా చాణక్యుడు తన చాణక్య నీతిలో వ్యక్తిత్వం గురించి చెబుతూ.. “పూల సువాసన గాలి వీచిన దిశలోనే వ్యాపిస్తుంది. కానీ మనిషిలోని మంచితనం మాత్రం అన్ని దిశలా విస్తరిస్తుంది” అని అన్నారు. కర్మ సిద్ధాంతం గురించి ఆయన మాట్లాడుతూ.. మనిషి ఒంటరిగానే పుడతాడు, ఒంటరిగానే మరణిస్తాడు. తన కర్మల వల్ల కలిగే మంచి – చెడు ఫలితాలను కూడా ఒంటరిగానే అనుభవిస్తాడని అన్నారు. చదువు గురించి చెబుతూ.. నిజానికి మనిషికి విద్యే గొప్ప స్నేహితుడు. విద్యావంతుడికి ప్రతిచోటా గౌరవం లభిస్తుంది. అందాన్ని, యవ్వనాన్ని కూడా విద్య ఓడిస్తుంది అని చెప్పారు.

స్నేహం గురించి ఆయన మాట్లాడుతూ.. ప్రతి స్నేహం వెనుక ఏదో ఒక స్వార్థం దాగి ఉంటుందని, స్వార్థం లేని స్నేహం ఈ ప్రపంచంలో ఉండదని, ఇదే చేదు నిజం అని అన్నారు. గొప్పతనం గురించి వివరిస్తూ.. మనిషి తన పుట్టుక వల్ల కాదు, తను చేసే పనుల వల్లే గొప్పవాడవుతాడు అని అన్నారు. అతి మంచితనం గురించి చెబుతూ.. మనిషి మరీ నిజాయతీగా ఉండకూడదని, అడవిలో తిన్నగా ఉన్న చెట్లనే మొదట నరుకుతారని, అలాగే లోకంలో నిజాయతీగా ఉండేవారిని కూడా త్వరగా ఇబ్బందులకు గురిచేస్తారని చెప్పారు. ఆత్మరక్షణ గురించి వివరిస్తూ.. పాము విషపూరితం కాకపోయినా.. తాను విషపూరితమైన దానిలాగే నటించాలి. అప్పుడే అది తనను తాను రక్షించుకోగలదని పేర్కొన్నారు. భయాన్ని ఎదుర్కోవడం గురించి చాణక్యుడు చెబుతూ.. భయం నీ దగ్గరకు వచ్చే వరకు ఆగవద్దు. అది నీ దరిదాపుల్లోకి రాగానే దానిపై దాడి చేసి నాశనం చేయ్యాలని చెప్పారు.

పట్టుదల గురించి వివరిస్తూ.. ఒక మనిషి తాను చేయాలనుకున్న పనిని సింహం లాగా పూర్తి శక్తితో, పట్టుదలతో చేయాలని వివరించారు. శత్రువు పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన సూచించారు. శత్రువు బలహీనత తెలిసే వరకు అతనితో స్నేహపూర్వకంగానే మెలగాలని చెప్పారు. వీరిని ఎట్టి పరిస్థితుల్లో నిద్ర లేపవద్దని చెప్పారు. అవి ఏవీ అంటే.. పాము, రాజు, పులి, కందిరీగ, చిన్న పిల్లవాడు, ఇతరుల కుక్క, మూర్ఖుడు.. ఈ ఏడుగురిని నిద్రపోతున్నప్పుడు అస్సలు లేపకూడదని సూచించారు. ప్రతీ మనిషికి నైపుణ్యమే అసలైన ఆస్తి అని చెప్పారు. నైపుణ్యం అనేది దాచిన నిధి లాంటిదని, పరాయి దేశంలో ఉన్నప్పుడు తల్లిలాగా మనల్ని కాపాడుతుందన్నారు. దుర్మార్గుల స్వభావం గురించి చెబుతూ.. పాము కోరలో, ఈగ నోటిలో, తేలు తోకలో విషం ఉంటుంది. కానీ దుర్మార్గుడికి మాత్రం శరీరం నిండా విషమే నిండి ఉంటుందన్నారు.

ప్రతీ మనిషికి మానసిక ప్రశాంతత అనేది చాలా ముఖ్యం అని చెప్పారు. ఆధ్యాత్మిక చింతన ద్వారా లభించే శాంతి, ఆనందం.. అత్యాశతో ఇక్కడ – అక్కడ తిరిగే వ్యక్తులకు ఎప్పటికీ లభించవన్నారు. రహస్యాలను దాచండి అని సూచించారు. నువ్వు చేయాలనుకున్న పనిని ఎవరికీ చెప్పవద్దని, ఆ పని పూర్తయ్యే వరకు దానిని అత్యంత రహస్యంగా ఉంచి, కార్యరూపంలో పెట్టి విజయం సాధించాలన్నారు. ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు నేటి ఆధునిక కాలంలో కూడా వ్యక్తిగత, వృత్తిపరమైన అభివృద్ధికి దిక్సూచిలా పనిచేస్తాయి. ఆయన చెప్పిన ఈ విషయాలను ఒకసారి మీ జీవితంలో కూడా పాటించి చూడండి.