Reading Time: 2 minutes
ధోని ఫైర్ నుంచి స్పాట్ ఫిక్సింగ్ వరకు.. ఐపీఎల్ హిస్టరీలో నిలిచిపోయిన చేదు జ్ఞాపకాలు..!

IPL Controversies: ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన, ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్ ఐపీఎల్, కేవలం సిక్సర్లు, ఫోర్లకే పరిమితం కాలేదు. గత 17 ఏళ్ల ప్రయాణంలో ఈ లీగ్ ఎన్నో సంచలనాలకు, మైదానంలో ఆటగాళ్ల మధ్య ఘర్షణలకు వేదికైంది. ‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ సహనం కోల్పోవడం నుంచి, మైదానంలోనే ఒక ఆటగాడు మరో ఆటగాడిని చెంపదెబ్బ కొట్టడం వరకు.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన 5 సందర్భాలను ఇప్పుడు చూద్దాం..

1. మైదానంలోకి దూసుకొచ్చిన ఎంఎస్ ధోనీ (2019)..

ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఎంఎస్ ధోనీ సైతం ఒకానొక సందర్భంలో అంపైర్ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో అంపైర్ ఉల్హాస్ గాంధే ఒక బంతిని ‘నో-బాల్’గా ప్రకటించి, వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. డగౌట్‌లో ఉన్న ధోనీ, ఈ గందరగోళాన్ని చూసి నియమావళిని పక్కన పెట్టి నేరుగా మైదానంలోకి దూసుకొచ్చాడు. అంపైర్ల వైపు వేలు చూపిస్తూ ఆయన వాదించిన తీరు క్రీడా ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది.

2. హర్భజన్ సింగ్ – శ్రీశాంత్ ‘చెంపదెబ్బ’ సీన్ (2008)..

ఐపీఎల్ ప్రారంభ సీజన్‌లోనే ఒక అత్యంత దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. ముంబై ఇండియన్స్ వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య మ్యాచ్ ముగిసిన తర్వాత, హర్భజన్ సింగ్ వేగంగా వెళ్లి శ్రీశాంత్‌ను చెంపదెబ్బ కొట్టాడు. ఆ తర్వాత శ్రీశాంత్ మైదానంలో బావురుమంటూ ఏడ్చిన దృశ్యాలు ఇప్పటికీ అభిమానుల మదిలో ఉన్నాయి. ఈ క్రమశిక్షణా రాహిత్యం కారణంగా హర్భజన్‌పై 11 మ్యాచ్‌ల నిషేధం పడింది.

3. కోహ్లీ vs గంభీర్: దశాబ్ద కాలపు వైరం..

విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య మైదానంలో జరిగే వాగ్వాదాలు ఐపీఎల్‌లో హాట్ టాపిక్. 2013లో ప్రారంభమైన వీరి వైరం, 10 ఏళ్ల తర్వాత 2023లో ఎల్ఎస్‌జీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్‌లో పతాక స్థాయికి చేరింది. మ్యాచ్ అనంతరం ఇద్దరు దిగ్గజాలు ఒకరిపై ఒకరు విరుచుకుపడటంతో ఆటగాళ్లు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. దీనివల్ల ఇద్దరికీ 100 శాతం మ్యాచ్ ఫీజు జరిమానాగా విధించారు.

4. అశ్విన్ ‘మాన్కడింగ్’ సంచలనం (2019)..

క్రికెట్ నిబంధనలకు, క్రీడా స్ఫూర్తికి మధ్య పెద్ద చర్చకు దారితీసిన ఘటన ఇది. 2019లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్, రాజస్థాన్ బ్యాటర్ జోస్ బట్లర్ క్రీజు దాటడం చూసి బంతి వేయకుండానే రనౌట్ (మాన్కడింగ్) చేశారు. ఇది నిబంధనల ప్రకారం కరెక్ట్ అయినప్పటికీ, క్రీడా స్ఫూర్తికి విరుద్ధమంటూ అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

5. 2013 స్పాట్ ఫిక్సింగ్ చీకటి అధ్యాయం..

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చీకటి రోజుగా 2013 స్పాట్ ఫిక్సింగ్ కేసును అభివర్ణించవచ్చు. రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చవాన్‌లను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారం ముదరడంతో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై రెండేళ్ల పాటు నిషేధం విధించారు. ఇది కోట్లాది మంది క్రికెట్ అభిమానుల నమ్మకాన్ని దెబ్బతీసిన సంఘటన.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..