Reading Time: < 1 minute
Indian Railways: రైల్లో వేల లీటర్ల నీరు ఎక్కడ నిల్వ చేస్తారు? టాయిలెట్ నీటి వెనుక ఇంజనీరింగ్ సీక్రెట్ ఇదే!

రైలు ప్రయాణంలో టాయిలెట్లు, వాష్ బేసిన్ల కోసం నీరు ఎక్కడి నుండి వస్తుందో చాలా మందికి తెలియదు. దీని వెనుక ఒక ప్రత్యేకమైన ఇంజనీరింగ్ వ్యవస్థ ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. సాధారణంగా ప్రతి రైలు కోచ్‌ పైన (Roof) కాకుండా, కోచ్‌ కింద లేదా లోపలి భాగంలో ఎవరికీ కనిపించని ప్రదేశాల్లో భారీ వాటర్ ట్యాంకులు ఉంటాయి. ఆధునిక ఎల్‌హెచ్‌బీ (LHB) కోచ్‌లలో అయితే ఈ ట్యాంకులు కోచ్‌ కింద భాగంలో అమర్చబడి ఉంటాయి. ఒక సాధారణ రైలు కోచ్‌లో సుమారు 1,500 నుండి 2,000 లీటర్ల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉంటుంది. ప్రయాణీకుల అవసరాలకు అనుగుణంగా ఈ సామర్థ్యం మారుతూ ఉంటుంది.

అయితే, ఇక్కడ మీకు మరో సందేహం కూడా వచ్చే ఉంటుంది. కోచ్‌ కింద ఉన్న నీరు ఎలా పైకి వస్తుందనేది మీ సందేహం. కోచ్ కింద ఉన్న ట్యాంకుల నుండి నీరు ట్యాప్‌లలోకి రావడానికి పంపులు (Pumps) లేదా గాలి పీడనం (Air Pressure) వ్యవస్థను ఉపయోగిస్తారు. దీనివల్ల నీరు వేగంగా పైకి ప్రవహిస్తుంది. ప్రతి ప్రధాన స్టేషన్‌లో లేదా జంక్షన్లలో వాటరింగ్ పాయింట్స్ ఉంటాయి. అక్కడ పెద్ద పెద్ద పైపుల ద్వారా కొన్ని నిమిషాల్లోనే కోచ్‌లోని అన్ని ట్యాంకులను నింపుతారు. దీనిని రైల్వే భాషలో హైడ్ రెంట్ సిస్టమ్ అని పిలుస్తారు.

రైలు కోచ్ బ్యాలెన్స్ తప్పకుండా ఉండటానికి ఈ ట్యాంకులను సమానంగా ఇరువైపులా అమరుస్తారు. అలాగే, నీరు తుప్పు పట్టకుండా, స్వచ్ఛంగా ఉండటానికి ఈ ట్యాంకులను స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేస్తారు. రైలు ఆగినా లేదా ప్రయాణంలో ఉన్నా నీరు అనవసరంగా వృధా కాకుండా ఉండేలా సెన్సార్ ట్యాప్‌లను కూడా ఇప్పుడు కొన్ని రైళ్లలో ఏర్పాటు చేస్తున్నారు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..