July 9, 2026

ICC T20 World Cup 2026 Team: భారత్‌ నుంచి నలుగురికి చోటు.. సూర్యకు షాక్, ఐసీసీ వరల్డ్ కప్‌ టీమ్‌కు కెప్టెన్ ఎవరంటే?

ICC T20 World Cup 2026 Team: భారత్‌ నుంచి నలుగురికి చోటు.. సూర్యకు షాక్, ఐసీసీ వరల్డ్ కప్‌ టీమ్‌కు కెప్టెన్ ఎవరంటే?
Reading Time: 2 minutes
Icc T20 World Cup 2026 Team Of The Tournament 4 Indians Selected Suryakumar Yadav Misses Out

ICC T20 World Cup 2026 Team of the Tournament: టీ20 ప్రపంచ కప్ 2026 ముగిసింది. అద్భుత ప్రదర్శనతో టైటిల్‌ను భారత్‌ కైవసం చేసుకుంది. మెగా టోర్నీ ముగిసిన నేపథ్యంలో ఐసీసీ ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’ జట్టును వెల్లడించింది. ఈ జట్టులో భారత్ నుంచి నలుగురు ఆటగాళ్లకు స్థానం దక్కింది. అయితే టీమిండియాకు ట్రోఫీ అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు చోటు లేకపోవడం అందరిని ఆశ్చర్యం కలిగించింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్‌ను ఐసీసీ తన జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ప్రొటీస్ జట్టును సెమీఫైనల్ వరకు తీసుకెళ్లిన మార్‌క్రమ్‌ నాయకత్వాన్ని ఐసీసీ ప్రశంసించింది.

ఐసీసీ జట్టును ప్రముఖ వ్యాఖ్యాతలు, క్రికెట్ నిపుణులతో కూడిన ప్యానెల్ ఎంపిక చేసింది. లెజెండరీ కామెంటేటర్ ఇయాన్ బిషప్, నాటాలీ జర్మానోస్, మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ ఈయాన్ మోర్గాన్, ఐసీసీ ప్రతినిధి గౌరవ్ సక్సేనా, క్రీడా జర్నలిస్ట్ రెక్స్ క్లెమెంటైన్ కలిసి ఐసీసీ జట్టును ఎంపిక చేశారు. టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లను ఎంపిక చేసి.. ప్లేయర్స్ జాబితాను విడుదల చేశారు. ఐసీసీ జట్టులో భారత్ నుంచి సంజు శాంసన్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలు స్థానం సంపాదించారు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన సంజు ఓపెనర్‌గా ఎంపికయ్యాడు. సెమీ ఫైనల్, ఫైనల్‌తో పాటు కీలక మ్యాచ్‌లలో అతడు అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడుతూ జట్టుకు విజయాలు అందించాడు.

ఇషాన్ కిషన్ కూడా అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. టీ20 ప్రపంచ కప్ 2026లో 317 పరుగులు చేసి జట్టుకు బలమైన ఆరంభాలు ఇచ్చాడు. పాకిస్థాన్‌పై 77 పరుగులు చేసిన ఇన్నింగ్స్ ప్రత్యేకంగా నిలిచింది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్‌లో రెండు అర్ధ శతకాలు చేయడంతో పాటు బౌలింగ్‌లో కూడా కీలక సమయంలో వికెట్లు తీసి జట్టుకు విజయాలు అందించాడు. మొత్తం తొమ్మిది వికెట్లు తీసి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెప్పించాడు. మరోవైపు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. టోర్నీలో ఎనిమిది మ్యాచ్‌లలో 14 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఫైనల్లో నాలుగు వికెట్లు తీసి మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు.

Also Read: India Performance: బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుతాలు.. టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత్ ప్లేయర్స్ ఇండివిజువల్ పెర్ఫామెన్స్ ఇదే!

అయితే భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు ఐసీసీ జట్టులో చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో అమెరికాపై 84 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడినా.. తర్వాతి మ్యాచ్‌ల్లో పెద్ద స్కోర్లు చేయలేకపోయాడు. టోర్నీలో అతడి స్కోర్లు 84*, 12, 32, 34, 18, 33, 18, 11, 0గా ఉన్నాయి. అయితే కెప్టెన్‌గా కీలక నిర్ణయాలు తీసుకుంటూ బౌలర్లను సమర్థంగా వినియోగించడంలో మంచి నాయకత్వాన్ని చూపించాడు. ఇక పాకిస్థాన్ ఆటగాడు సహిబ్జాదా ఫర్హాన్ కూడా చోటు దక్కించుకున్నాడు. అతడు మొత్తం 383 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇందులో రెండు శతకాలు కూడా ఉన్నాయి. ఆసక్తికర విషయం ఏమిటంటే ఫైనల్‌కు చేరుకున్న న్యూజిలాండ్ జట్టు నుంచి ఒక్క ఆటగాడికీ ఈ జట్టులో స్థానం దక్కలేదు. విల్ జాక్స్, జేసన్ హోల్డర్, లుంగి ఎన్‌గిడి, ఆదిల్ రషీద్, బ్లెస్సింగ్ ముజరబానిలు జట్టులో చోటు దక్కిచుకున్నారు. 12వ ప్లేయర్‌గా షాడ్లీ వాన్‌ ఉన్నాడు.

ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్:
సహిబ్జాదా ఫర్హాన్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, ఐడెన్ మార్‌క్రమ్‌ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్, జేసన్ హోల్డర్, జస్ప్రీత్ బుమ్రా, లుంగి ఎన్‌గిడి, ఆదిల్ రషీద్, బ్లెస్సింగ్ ముజరబాని.