Reading Time: < 1 minute
Telangana Double Bedroom House Allotment Cancellation Rules

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు , అక్రమాలను అరికట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ పథకం అసలు ఉద్దేశం పేదలకు సొంత గూడు కల్పించడం కాబట్టి దానిని పక్కదారి పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది.

ప్రభుత్వం కేటాయించిన ఇళ్లలో లబ్ధిదారులు కాకుండా ఇతరులు నివసిస్తున్నట్లు తేలితే… ఆ కేటాయింపులను రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. చాలా చోట్ల లబ్ధిదారులు తమకు వచ్చిన ఇళ్లను ఇతరులకు అద్దెకు ఇవ్వడం లేదా అమ్ముకోవడం వంటి ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇలాంటి వారిని గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది.

Also Read:కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం.. వారి జీతాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ..

అనర్హులు లేదా అక్రమంగా నివసిస్తున్న వారిని గుర్తించి వెంటనే వారికి నోటీసులు జారీ చేస్తారు. నోటీసు అందుకున్న తర్వాత అందులో పేర్కొన్న సమయంలోగా సరైన వివరణ ఇవ్వని పక్షంలో.. వారి ఇంటి కేటాయింపును ప్రభుత్వం వెంటనే రద్దు చేస్తుంది. రద్దు చేసిన ఇళ్లను వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ఇతర అర్హులైన పేదలకు కేటాయించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

భవిష్యత్తులో అక్రమాలను నివారించడానికి లబ్ధిదారుల వేలిముద్రలు లేదా ఆధార్ ఆధారిత తనిఖీలు చేపట్టే ఆలోచనలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఈ నిర్ణయం వల్ల నిజమైన పేదలకు న్యాయం జరుగుతుందని.. రాజకీయ నాయకుల సిఫార్సులతో లేదా అక్రమ మార్గాల్లో ఇళ్లను పొందిన వారికి చెక్ పడుతుందని భావిస్తున్నారు.