Reading Time: < 1 minute

ఉత్తర్వులు అమలుచేయకపోతే కోర్టుకు రండి : హైకోర్టు

Caption of Image.
  • ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: మిషన్‌ భగీరథ కింద ఎన్‌సీసీ కంపెనీ చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ సుల్తానియాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈనెల 13లోగా బిల్లులు చెల్లించాలన్న గత ఉత్తర్వులను అమలు చేసి రిపోర్టు ఇవ్వాలని పేర్కొంటూ, లేనిపక్షంలో వ్యక్తిగతంగా కోర్టు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు, మహేశ్వరం నియోజకవర్గాలకు మిషన్‌ భగీరథ కింద తాగునీటి పథకాల నిర్మాణం, నిర్వహణకు సంబంధించి రూ.180.17 కోట్ల బిల్లుల్లో ఆమోదించిన మొత్తాన్ని చెల్లించాలన్న కోర్టు ఉత్తర్వులు అమలు కాలేదంటూ ఎన్‌సీసీ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిని జస్టిస్‌ పి.మాధవీదేవి శుక్రవారం విచారించారు.

భగీరథ ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణకు ప్రభుత్వంతో 2015లో అగ్రిమెంట్‌ జరిగిందని, పనులకు టోకెన్లు జారీ తప్ప బిల్లులు చెల్లించడంలేదని, ఆరు శాతం వడ్డీతో చెల్లించాలన్న కోర్టు ఉత్తర్వులను కూడా అమలు చేయలేదని పిటిషనర్‌ న్యాయవాది పేర్కొన్నారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవుతాయని చెప్పి వ్యక్తిగత హాజరీ నుంచి సుల్తానియా మినహాయింపు పిటిషన్‌ వేసినట్లు ప్రభుత్వ న్యాయవాది చెప్పారు.

©️ VIL Media Pvt Ltd.