Reading Time: 2 minutes

నల్గొండ: కూలీ పైసల పంచాయితీ.. వ్యక్తి హత్య

Caption of Image.
  •     నల్గొండ పట్టణంలోని మీర్ బాగ్ కాలనీలో ఘటన

నల్గొండ, వెలుగు : కూలీ డబ్బుల పంపకంలో తలెత్తిన వివాదంలో తోటి కూలీలే.. ఓ వ్యక్తిని హత్య చేశారు. ఈ ఘటన నల్గొండ పట్టణంలోని మీర్ బాగ్ కాలనీలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ పట్టణంలో కొత్తగా నిర్మిస్తున్న చెన్నై షాపింగ్ మాల్ ఇంటీరియల్ పనుల కోసం తమిళనాడు నుంచి కూలీలు వచ్చారు. వీరితో పాటు తూత్తుకుడికి చెందిన ముత్తు రాజు (38) సైతం నల్గొండకు వచ్చాడు. వీరంతా పట్టణంలోని మీర్ బాగ్ కాలనీ రోడ్ నంబర్ 6లోని షా రెసిడెన్సీ అపార్ట్‌‌ మెంట్ ఓ గదిని రెంట్ తీసుకొని ఉంటున్నారు. ఆదివారం ఉదయం షాపింగ్ మాల్ సూపర్ వైజర్ ఎన్ని సార్లు ఫోన్ చేసి ఎత్తకపోవడంతో ఆయన అపార్ట్ మెంట్ కు వెళ్లాడు. 

డోర్లు వేసి ఉండడం, ఎవరూ ఓపెన్ చేయకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి డోర్లు ఓపెన్ చేసి చూడగా.. ముత్తు రాజు రక్తపు మడుగులో చనిపోయి కనిపించాడు. అతడి జుట్టు పట్టుకొని నేలకేసి కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. కూలీ డబ్బుల పంపకం విషయంలో తలెత్తిన గొడవే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ శివరామరెడ్డి, టూ టౌన్ సీఐ ఆదిరెడ్డి, ఎస్సై సైదాబాబు ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ ను రప్పించి ఆధారాలు సేకరించారు. షాపింగ్ మాల్ సూపర్ వైజర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు టూ టౌన్ ఎస్సై సైదాబాబు తెలిపారు. హత్యకు పాల్పడిన నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

తండ్రిని చంపిన కొడుకు

నవాబ్ పేట, వెలుగు : మద్యానికి బానిసగా మారడంతో పాటు పని చేయకుండా తిరుగుతున్న తండ్రిని ఓ కొడుకు కొట్టి చంపాడు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలం దేపల్లి గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన రాపోలు రాములు (55) మద్యానికి బానిసై.. పనిచేయకుండా తిరిగేవాడు. ఈ విషయంపై రాములుకు, అతడి రెండో కొడుకు సురేందర్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన సురేందర్ శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో తండ్రి రాములుపై కర్రతో దాడి చేశాడు. అనంతరం తలపై రాయితో కొట్టడంతో రాములు అక్కడికక్కడే చనిపోయాడు. కొద్దిసేపటి తర్వాత గుర్తించిన స్థానికులు షాద్ నగర్ లో ఉంటున్న పెద్దకొడుకు శ్రీకాంత్ కు సమాచారం ఇచ్చారు. ఆయన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని, నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.