
హర్యానాలోని అంబాలా నగర సమీపంలో ఆదివారం (సెప్టెంబర్ 27) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ధుల్కోట్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న మూడు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆరుగురు కార్మికులు మృతి చెందారు. మరో 10 మందికి పైగా గాయపడ్డారు. సాయంత్రం చీకటి పడకముందు నిర్మాణ పనులు కొనసాగుతుండగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు ప్రారంభించి పోలీసులకు, అత్యవసర సేవల సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి.
అంబాలా సివిల్ సర్జన్ రేణు బేరి తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం 12 మంది గాయపడిన కార్మికులను ఆసుపత్రికి తరలించారు. వారిలో ఐదుగురు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇద్దరిని వారి అభ్యర్థన మేరకు డిశ్చార్జ్ చేయగా, మిగిలిన వారికి ప్రథమ చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి పంపించారు. ప్రమాదం అనంతరం నలుగురి మృతదేహాలను ఆసుపత్రికి తీసుకువచ్చి మార్చురీలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. అనంతరం మృతుల సంఖ్య ఆరుగురికి చేరింది.
శిథిలాల కింద మరికొందరు?
భవనం శిథిలాల కింద మరో ఇద్దరు- ముగ్గురు కార్మికులు చిక్కుకుని ఉండొచ్చని గుర్తించినట్లు అంబాలా ఎస్పీ అజిత్ సింగ్ షెఖావత్ తెలిపారు. వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు సహాయక బృందాలు శిథిలాలను తొలగిస్తున్నాయి. ధుల్కోట్ గ్రామంలో సుమారు రెండు నెలలుగా భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆదివారం 17 మంది కార్మికులు మూడో అంతస్తులో లింటెల్ ఏర్పాటు పనుల్లో ఉన్నారు. వెనుక వైపున ఉన్న లింటెల్ ఒక్కసారిగా కూలిపోవడంతో రెండో, మొదటి అంతస్తుల లింటెల్స్ కూడా వరుసగా కూలిపోయాయి. దీంతో గోడలు సైతం కూలి కార్మికులు శిథిలాల్లో చిక్కుకున్నారు.
మొదటి అంతస్తులో ప్లాస్టరింగ్ పనులు చేస్తున్న 10 నుంచి 12 మంది కార్మికులు లింటెల్‌లోని రీబార్ జాలిలో చిక్కుకున్నారు. వారిలో ఆరుగురు ముందుకు దూకి బయటపడగా, మిగిలిన వారు శిథిలాల కింద పడిపోయారు. రెండో అంతస్తు లింటెల్‌ను 10–12 రోజుల క్రితమే ఏర్పాటు చేయగా, షట్టరింగ్‌ను ఒకటి రెండు రోజుల క్రితమే తొలగించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
#WATCH | Haryana | One more body has been recovered, raising the death toll to 6 in Ambala under-construction building collapse. Search and rescue operations continue. https://t.co/KeILkg088j
— ANI (@ANI) September 27, 2026
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..