Reading Time: < 1 minute
Godavari Flood Alert Dowleswaram Barrage Water Level Near First Warning

Godavari Flood Alert: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద జలాల ప్రభావంతో ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద నీటిమట్టం 11 పాయింట్ 6,0 అడుగులకు చేరుకుని మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరువలో ప్రవహిస్తోంది. నీటిమట్టం 11 పాయింట్ 7,5 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. అయితే గత కొద్ది గంటలుగా గోదావరి వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతుండటంతో నీటిమట్టం మరింత పెరిగి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని చేరుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు. వరద పరిస్థితులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గోదావరి నుంచి వస్తున్న భారీ నీటి ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని ధవళేశ్వరం బ్యారేజ్‌కు సంబంధించిన 175 గేట్లను ఎత్తివేశారు. ప్రస్తుతం బ్యారేజ్ నుంచి 9 లక్షల 62 వేల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.