
- 309 లోన్లలో ఎస్బీఐకి భారీ లాస్
న్యూఢిల్లీ: నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) ద్వారా గత తొమ్మిదేళ్లలో పరిష్కారమైన లోన్ల కేసుల్లో ఎస్బీఐకి భారీనష్టం (హెయిర్కట్) వచ్చినట్టు సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైంది. బకాయిల వసూలుకు ఈ బ్యాంకు309 లోన్ ఖాతాలను ట్రిబ్యునల్కు పంపించింది. ఇవి చెల్లించాల్సిన మొత్తం రూ.1,49,895 కోట్లు కాగా, రూ.49,727 కోట్లు మాత్రమే తిరిగి రాబట్టుకోగలిగింది. ఫలితంగా రూ.1,00,168 కోట్ల మేర నష్టం వాటిల్లింది. రూ.100 కోట్లకు పైగా బాకీ ఉన్న పెద్ద రుణగ్రహీతల లోన్లలో ఎస్బీఐ రూ.1,51,857 కోట్లను రైటాఫ్ చేసింది. వీటిలో రూ.20,838 కోట్లు మాత్రమే రికవరీ చేయగలిగింది.
పుణేకు చెందిన సామాజిక కార్యకర్త వివేక్ వెలంకర్ ఆర్టీఐ కింద దరఖాస్తు చేయగా, ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2019లో అత్యధికంగా రూ.46,348 కోట్లను రైటాఫ్ చేయగా, రూ.4,548 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. రూ.కోటి కంటే తక్కువ తీసుకున్న చిన్న రుణగ్రహీతల విషయంలోనూ భారీగా మొండి బకాయిలు పేరుకుపోయాయి. రూ.63,103 కోట్లను రైటాఫ్ చేయగా కేవలం రూ.6,815 కోట్లే వెనక్కి వచ్చాయి. వాణిజ్య రహస్యాలు, వ్యక్తిగత సమాచార భద్రత చట్టాల కింద రుణగ్రహీతల పేర్లను బ్యాంకు బయటపెట్టలేదు.