
- ‘వెడ్డింగ్స్-ఫిల్మ్స్’ బిజినెస్ సమ్మిట్‌లో వక్తలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఆసియాలోనే అతిపెద్ద బీ2బీ వెడ్డింగ్ సమ్మిట్ ‘డబ్ల్యూవీ కనెక్ట్–2026’ నాలుగో ఎడిషన్ ‘వెడ్డింగ్స్ అండ్ ఫిల్మ్స్’ థీమ్‌తో బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. మొయినాబాద్‌లోని అర్థ్ రిసార్ట్స్‌లో జరుగుతున్న ఈ మూడు రోజుల సదస్సుకు 20కిపైగా సిటీల నుంచి 800 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. సమ్మిట్‌ను డిజైన్ బై రాజా వ్యవస్థాపకుడు కుమార్ రాజా, క్యూ ఈవెంట్స్ వ్యవస్థాపకుడు రితురాజ్ ఖన్నా, ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, విజ్‌క్రాఫ్ట్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు సబ్బాస్ జోసెఫ్, వెడ్డింగ్ వావ్స్-డబ్ల్యూవీ కనెక్ట్ వ్యవస్థాపకుడు దక్షిణామూర్తి ఎన్ నాయుడు ప్రారంభించారు. వివాహాలు, సినిమా, హాస్పిటాలిటీ, ఈవెంట్స్, టూరిజం, క్రియేటివ్ రంగాలకు చెందిన ప్రముఖులు ఇందులో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దేశంలో వెడ్డింగ్ ఇండస్ట్రీ విలువ రూ.3.86 లక్షల కోట్లు కాగా, ఫిల్మ్, ఓటీటీ రంగం విలువ కేవలం రూ.1.97 లక్షల కోట్లు మాత్రమేనన్నారు.
సినిమాలపై వివాహాల వైభవ ప్రభావం
విజ్‌క్రాఫ్ట్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు సబ్బాస్ జోసెఫ్ మాట్లాడుతూ హైదరాబాద్ కొత్త సినిమా రాజధానిగా ఎదుగుతోందని, ప్రస్తుతం హాలీవుడ్ సైతం తెలుగు సినిమావైపు చూస్తోందన్నారు. సినిమా, వివాహాలు పరస్పరం ప్రభావితం చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. సినిమా సెట్ల నుంచి వివాహ మండపాల రూపకల్పనకు స్ఫూర్తి లభిస్తోందని, అదే విధంగా వివాహాల వైభవం సినిమాలపై ప్రభావం చూపుతోందన్నారు. నాలుగుసార్లు జాతీయ అవార్డు తీసుకున్న సాబు సిరిల్ మాట్లాడుతూ టెక్నాలజీ, క్రియేటివిటీకి ప్రాధాన్యం ఇస్తూ యువత సమస్యలను అవకాశాలుగా మలుచుకోవాలని సూచించారు.