Reading Time: 2 minutes

హరిత హోటల్స్ కు నయా లుక్.. రాష్ట్రవ్యాప్తంగా 27 టూరిజం హోటళ్ల ఆధునీకరణకు కసరత్తు

Caption of Image.
  • ఒక్కో హోటల్‌‌‌‌‌‌‌‌కు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల కేటాయించేలా ప్లాన్‌‌‌‌ 
  • కార్పొరేట్ హోటళ్ల తరహాలో ఫర్నీచర్, సరికొత్త బెడ్స్, వాల్ డిజైన్లు 
  • నిఘా నీడలో కిచెన్లు.. హెడ్ ఆఫీస్ నుంచే లైవ్ మానిటరింగ్ 
  • పర్యాటకులను ఆకర్షించడమే టార్గెట్

హైదరాబాద్, వెలుగు:  తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (టీజీటీడీసీ) ఆధ్వర్యంలోని హరిత హోటళ్లు త్వరలోనే సరికొత్త రూపు సంతరించుకోనున్నాయి. ప్రైవేట్ హోటళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా కార్పొరేట్ స్థాయిలో సకల సౌకర్యాలతో ముస్తాబు కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పర్యాటకుల రద్దీ గణనీయంగా పెరుగుతుండటంతో వారికి మెరుగైన ఆతిథ్యం ఇవ్వడంతోపాటు సంస్థ ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా పర్యాటకశాఖ ప్రణాళికను రెడీ చేసింది. కార్పొరేషన్ పరిధిలో ఉన్న 29 హోటళ్లను దశలవారీగా రెనొవేషన్ చేయాలని నిర్ణయించింది. కాగా,  రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక శాఖకు మొత్తం 87 ఆస్తులు (హోటళ్లు, రిసార్టులు, వే సైడ్ ఎమినిటీస్) ఉన్నాయి.

వీటిలో దాదాపు 50 ఆస్తులను ఇప్పటికే పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తున్నాయి. మిగిలిన వాటిలో కార్పొరేషన్ ప్రత్యక్ష పర్యవేక్షణలో 29 కీలకమైన హరిత హోటళ్లు నడుస్తున్నాయి. అయితే, ఇవన్నీ దాదాపు 15 నుంచి 20 ఏండ్ల క్రితం నిర్మించినవి కావడంతో భవనాలు పాతబడిపోయాయి. రూములు, ఫర్నీచర్, ప్లంబింగ్ వ్యవస్థలు పాడైపోయి పర్యాటకులకు అసౌకర్యం కలుగుతోంది. దీంతో వీటి స్థానంలో ఆధునిక హంగులు జోడించి, సరికొత్త లుక్ తీసుకురావాలని అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఒక్కో హోటల్‌‌‌‌‌‌‌‌కు సుమారు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అవుతుందని అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించారు. అనుమతులు రాగానే టెండర్లు పిలిచి పనులు చేపట్టనున్నారు.

లగ్జరీ ఇంటీరియర్స్

రూముల్లో కార్పొరేట్ హోటళ్ల తరహాలో ప్రీమియం ఫర్నీచర్, సరికొత్త బెడ్స్, ఆకర్షణీయమైన కర్టెన్లు, వాల్ డిజైన్లు చేపట్టాలని భావిస్తున్నారు. ప్రతి గదిలో హైస్పీడ్ ఫ్రీ వై-ఫై, పెద్ద ఎల్ఈడీ స్మార్ట్ టీవీలు, ఇంటర్‌‌‌‌‌‌‌‌కామ్ సదుపాయం కల్పించనున్నారు. పాత శానిటరీ సామాన్లను తొలగించి, బ్రాండెడ్ ఫిట్టింగ్స్, గీజర్లు,  24 గంటల వేడినీటి సరఫరా చేయనున్నారు. అలాగే, తెలంగాణ స్థానిక వంటకాలతోపాటు నార్త్, సౌత్ ఇండియన్, చైనీస్ ఫుడ్ వెరైటీలు చేసేలా ప్లాన్​ చేస్తున్నారు. ఫ్యామిలీ ఫంక్షన్లు, బిజినెస్ మీటింగ్‌‌‌‌‌‌‌‌లు, డెస్టినేషన్ వెడ్డింగ్స్ కోసం అత్యాధునిక సౌండ్ సిస్టమ్, సెంట్రలైజ్డ్ ఏసీతో బ్యాంక్వెట్ హాళ్ల అప్‌‌‌‌‌‌‌‌గ్రేడేషన్ చేయనున్నారు. హోటళ్ల ఆవరణలో పచ్చని గార్డెన్లు, వాకింగ్ ట్రాక్స్, పిల్లల ప్లే ఏరియా, రాత్రివేళల్లో ఆకట్టుకునేలా ప్రత్యేక లైటింగ్ (ఫాసాడ్ లైటింగ్) ఏర్పాటు చేయనున్నారు.  

హెడ్ ఆఫీస్ నుంచే పర్యవేక్షణ.. సీసీ కెమెరాల నిఘా

హరిత హోటళ్లలో సేవల నాణ్యతను పెంచేందుకు టెక్నాలజీకి పెద్దపీట వేస్తున్నారు. అన్ని హోటళ్ల రిసెప్షన్, డైనింగ్ హాల్స్, కారిడార్లు, పార్కింగ్ ఏరియాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. హోటల్ కిచెన్లలో శుభ్రత ఎలా ఉంది? వంటలు ఎలా చేస్తున్నారు? అనేది పర్యవేక్షించేందుకు కిచెన్లలో సీసీ కెమెరాలు పెడుతున్నారు.  హోటల్ గదులు, రెస్టారెంట్లు, వంటశాలలు, ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత,  సిబ్బంది పనితీరును పరిశీలించే చాన్స్​ ఉంటుంది.  పర్యాటకులకు అందించే ఆహార నాణ్యత, వంటశాలల పరిశుభ్రతను పరిశీలించనున్నారు. హోటళ్లలోని అన్ని సీసీ కెమెరాల దృశ్యాలను హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని టూరిజం హెడ్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌కు అనుసంధానించనున్నారు.

ఉన్నతాధికారులు అక్కడి నుంచే ఏ హోటల్‌‌‌‌‌‌‌‌లో ఏం జరుగుతుందో 24 గంటలూ మానిటర్ చేసేలా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటవుతున్నది. దీనివల్ల సిబ్బంది నిర్లక్ష్యానికి చెక్ పడటంతోపాటు పర్యాటకులకు మెరుగైన రక్షణ లభిస్తుందని ఆఫీసర్లు పేర్కొంటున్నారు. అంతేకాదు, హరిత ప్రాపర్టీలలో నాణ్యత, పరిశుభ్రత, సేవా ప్రమాణాలను పర్యవేక్షించేందుకు విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ బృందాలు హరిత హోటళ్లను తనిఖీ చేసి.. ఆహార నాణ్యత, వంటశాలల పరిశుభ్రత, గదుల నిర్వహణ సేవా ప్రమాణాలను పరిశీలించనున్నాయి. 

పెరగనున్న ఆదాయం..

హోటళ్లను ఆధునీకరించడం ద్వారా వీకెండ్స్‌‌‌‌‌‌‌‌తోపాటు సాధారణ రోజుల్లోనూ ఆక్యుపెన్సీ పెరుగుతుందని టూరిజం ఎండీ గౌతమి పేర్కొన్నరు. నాణ్యమైన ఆహారం, ఆహ్లాదకరమైన వాతావరణం, సురక్షితమైన వసతి కల్పిస్తే ప్రభుత్వ హోటళ్ల వైపే ప్రజలు మొగ్గు చూపుతారని, తద్వారా టూరిజం కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌కు భారీగా ఆదాయం సమకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. హరిత హోటళ్లలో వసతి బుకింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు పూర్తిస్థాయి ఆటోమేటెడ్ బుకింగ్ వ్యవస్థను అమలు చేస్తున్నామని తెలిపారు.  దీంతో పర్యాటకులు గదుల లభ్యతను ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో తెలుసుకొని, సులభంగా, వేగంగా బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. డిజిటల్ విధానం ద్వారా బుకింగ్ ప్రక్రియలో సౌలభ్యం, పారదర్శకత పెంచనున్నట్టు చెప్పారు.  హరిత హోటళ్లను అత్యుత్తమ హోటల్ ప్రమాణాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.

©️ VIL Media Pvt Ltd.