
ఏలూరు : పచ్చని పంట చేలు, ప్రశాంతమైన గ్రామీణ వాతావరణం, విద్యాబుద్ధులు నేర్పే బడుల ముంగిట అనూహ్యంగా మత్తు భూతం కోరలు చాచింది. నార్కోటిక్ విభాగంలో అత్యంత కఠిన నిబంధనల నడుమ విక్రయించాల్సిన ప్రాణాంతక మత్తు ఇంజెక్షన్లు ఇష్టారాజ్యంగా బహిరంగ ప్రదేశాల్లో దర్శనమివ్వడం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం శివారు వేగవరం ఉన్నత పాఠశాలకు కూతవేటు దూరంలో ఉన్న ఓ పామాయిల్ తోటలో నిల్వలు గుట్టలుగా బయటపడటంతో, పాఠశాల విద్యార్థులు, యువతను టార్గెట్ చేస్తూ సాగుతున్న భారీ మత్తు దందా బండారం బట్టబయలైంది. ఈ రాకెట్‌పై ఔషధ నియంత్రణ విభాగం అధికారులు మెరుపు దాడులు చేపట్టి, స్థానిక మెడికల్ ఏజెన్సీల అంతర్రాష్ట్ర అక్రమ లింకులను ఆధారాలతో సహా రట్టు చేశారు.
వేగవరం హైస్కూల్ పరిసరాల్లోని తోటలోకి బుధవారం ఉదయం వెళ్లిన రైతులకు వాడేసినవి, ఇంకా సీల్ తీయని ట్రామడెక్స్, ట్రామెక్ బ్రాండ్ల వయల్స్‌తో పాటు సిరంజిలు భారీగా కుప్పలుగా పడి ఉండటం కనిపించింది. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా కనీసం ముట్టుకోవడానికి కూడా వీల్లేని ఈ నార్కోటిక్ మందులు పాఠశాల పక్కనే కనిపించడంతో గ్రామస్తులు విస్తుపోయి విజిలెన్స్, డ్రగ్ కంట్రోల్ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన స్థానిక డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పి. మల్లిఖార్జునరావు, ఏలూరు డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఎం. విక్రమ్‌రెడ్డి తమ బృందాలతో కలిసి తోటను పరిశీలించి, పడి ఉన్న ఇంజెక్షన్ల నమూనాలను సేకరించారు. ఆ వయల్స్‌పై ఉన్న బ్యాచ్ నంబర్లు, తయారీ కంపెనీల వివరాల ఆధారంగా లోతైన ఆడిట్ చేపట్టగా, స్థానిక ఏజెన్సీల ద్వారానే ఇవి పంపిణీ అయినట్లు స్పష్టమైంది. అధికారుల తనిఖీల్లో పట్టణంలోని పాత బ్రేక్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయం సమీపంలో గల ‘లక్ష్మీ శ్రీనివాస మెడికల్ ఏజెన్సీ’ వికృత రూపం బయటపడింది. గడచిన మూడు నెలల వ్యవధిలోనే హైదరాబాద్ నుంచి సుమారు 20 వేల ‘ట్రామడెక్స్’ ఇంజెక్షన్లను ఈ ఏజెన్సీ తెప్పించినట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే, ఇంత భారీ మొత్తంలో వచ్చిన ఔషధాలను ఎవరికి విక్రయించారు? బిల్లులు ఎక్కడ? అన్న ప్రశ్నలకు నిర్వాహకుడు కిశోర్ నుంచి పొంతనలేని సమాధానాలు వచ్చాయి. సదరు ఇంజెక్షన్లను తాము డంపింగ్ యార్డులో పారబోశామంటూ అధికారుల ఎదుట బుకాయించే ప్రయత్నం చేయడం నిర్వాహకుల నిర్లక్ష్యానికి, అక్రమ దందాకు అద్దం పడుతోంది.
అదేవిధంగా మసీదు సెంటర్‌లోని ‘విరూప పెద్దింటి మెడికల్ ఏజెన్సీ’పై నిర్వహించిన దాడుల్లో అంతర్రాష్ట్ర దందా బట్టబయలైంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం నుంచి ఏకంగా 5 వేల ‘ట్రామెక్’ వయల్స్‌ను దిగుమతి చేసుకున్న ఈ సంస్థ, అందులో సుమారు 3,800 ఇంజెక్షన్లను అక్రమంగా సరిహద్దులు దాటించింది. తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేట మండలం కన్నాయిగూడెంలోని ‘రిష్వంత్ జనరల్ స్టోర్స్’ అనే దుకాణానికి వీటిని విక్రయించినట్లు పక్కా లెక్కలు దొరికాయి. మార్కెట్లో దాదాపు రూ.6 లక్షల విలువ చేసే ఈ తీవ్రమైన పెయిన్ కిల్లర్లను నరాల ద్వారా నేరుగా తీసుకుంటే అసాధారణ మత్తు వస్తుందని, శారీరక అలసట మర్చిపోవడానికి కొందరు దీనిని వ్యసనంగా మార్చుకుంటున్నారని అధికారులు వెల్లడించారు. సరైన మోతాదు లేకుండా వైద్య పర్యవేక్షణ లోపిస్తే కిడ్నీలు పూర్తిగా పాడై ప్రాణాపాయం సంభవిస్తుందని హెచ్చరించారు. ప్రస్తుతం పట్టుబడిన రెండు మెడికల్ ఏజెన్సీలపై డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం కింద కేసులు నమోదు చేసి ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక సమర్పించారు. అయితే, ఏజెన్సీల లైసెన్సులు రద్దు చేయడంతోనే చేతులు దులుపుకోకుండా, ఈ వ్యవహారంపై పోలీసు శాఖ లోతైన దర్యాప్తు జరపాలని స్థానికులు కోరుతున్నారు. వేగవరం స్కూల్ విద్యార్థులను, స్థానిక యువతను వ్యసనపరులుగా మార్చేందుకు ప్రయత్నించిన ఈ మాఫియా వెనుక ఉన్న అసలు సూత్రధారులను కటకటాల్లోకి నెట్టాలని తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి.