
- వారం రోజులుగా జేసీబీలతో మొరం, మట్టి తరలింపు
- ఇప్పటికే 25 వేల క్యూబిక్ మీటర్లు తరలించినట్లు ఆరోపణలు
- గుట్టల పరిరక్షణకు ఉద్యమానికి సిద్ధమవుతున్న భక్తులు
మహబూబ్‌నగర్/చిన్నచింతకుంట, వెలుగు : తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కురుమూర్తి గుట్టలు అక్రమ తవ్వకాలతో కనుమరుగవుతున్నాయి. వెయ్యేండ్ల చరిత్ర, ఏడు కొండలతో పేదల తిరుపతిగా పేరొందిన కురుమూర్తి క్షేత్రాన్ని అక్రమార్కులు చెరబడుతున్నారు. అభివృద్ధి పనుల పేరుతో కొందరు మొరం, రాయి, మట్టిని అక్రమంగా తవ్వి తరలిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు తరచూ చర్యలు తీసుకుంటున్నప్పటికీ అక్రమ తవ్వకాలను పూర్తి స్థాయిలో అరికట్టలేకపోతున్నారని భక్తులు అంటున్నారు. మైనింగ్మాఫియా వెనుక రాజకీయ అండదండలు ఉన్నట్లు తెలుస్తోంది.
పర్మిషన్ లేకుండానే..
మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ శివారులోని కురుమూర్తి క్షేత్రానికి సర్వే నంబర్ 99లో ఏడు గుట్టలు ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఘాట్ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పనులకు అవసరమైన మట్టి కోసం కాంట్రాక్ట్ సంస్థ అనుమతులు లేకుండా ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న పెద్దగుట్టను తవ్వడం ప్రారంభించింది.
వారం రోజులుగా జేసీబీలతో మట్టి తవ్వి టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారని, ఇప్పటివరకు సుమారు 25 వేల క్యూబిక్ మీటర్ల మొరం తరలించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. వారం క్రితం ఆలయానికి వచ్చిన భక్తులు, రైతులు తవ్వకాలను గుర్తించారు. కురుమూర్తి, చిన్నచింతకుంట, అమ్మాపూర్, గూడూరు, తిమ్మాపురం తదితర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో గుట్టల వద్దకు చేరుకున్నారు. అనుమతులు లేకుండా తవ్వకాలు ఎందుకు చేపడుతున్నారని ప్రశ్నిస్తూ పనులను అడ్డుకున్నారు.
దీంతో అక్కడి నుంచి తవ్వకాలు చేపడుతున్న వారు వెనుదిరిగారు. అనంతరం భక్తులు సీఎంవో అధికారులకు ఫిర్యాదు చేయగా, ఘటనపై విచారణ జరపాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిసింది. పెద్దగుట్ట వద్ద తవ్వకాలపై చిన్నచింతకుంట తహసీల్దార్ ఎల్లయ్యను ‘వెలుగు’ వివరణ కోరగా, మొరం తవ్వకాలకు ఎవరికీ అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. మైనింగ్ శాఖ నుంచి కూడా తవ్వకాలకు అనుమతులు లేనట్లు సమాచారం.
గతంలోనూ తవ్వకాలు..
2023 సెప్టెంబరులోనూ అభివృద్ధి పనుల పేరుతో ఇదే గుట్టను అనుమతులు లేకుండా సుమారు 21 మీటర్ల మేర తవ్వి మొరం తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో భక్తులు ఆందోళన చేయడంతో కాంట్రాక్టర్ పనులను నిలిపివేశారు. కురుమూర్తి క్షేత్రం వెనుక ఉన్న కొండను క్రషర్ క్వారీ కోసం తవ్వేందుకు ఇటీవల ప్రయత్నించగా, అధికారులు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు, భక్తులు, రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో క్వారీకి అనుమతులు నిరాకరించినట్లు తెలిసింది.
గుట్టల పరిరక్షణకు ఉద్యమం..
కురుమూర్తి గుట్టలను తరచూ తవ్వకాలకు గురిచేస్తుండటంపై భక్తులు, హిందూ ధార్మిక సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంపై బుధవారం కురుమూర్తి క్షేత్రం వద్ద సమావేశమై భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. గుట్టల పరిరక్షణ విషయంలో మైనింగ్, ఎండోమెంట్, రెవెన్యూ శాఖలు కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.