
- గుడ్డెందొడ్డి, ర్యాలంపాడు పంటకాల్వలకు సైతం విడుదల చేసిన ఎమ్మెల్యే
గద్వాల, వెలుగు : జూరాల కుడి కాల్వతో పాటు నెట్టెంపాడు లిఫ్టు పరిధిలో నిర్మించిన గుడ్డెందొడ్డి, ర్యాలంపాడు రిజర్వాయర్ల కింద పంట కాల్వలకు బుధవారం నీటిని విడుదల చేశారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జూరాలతో పాటు ర్యాలంపాడు, గుడ్డెందొడ్డి రిజర్వాయర్ల వద్ద ప్రత్యేక పూజలు చేసి నీటి విడుదలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గద్వాల నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎల్ నినో ప్రభావంతో ఈ సీజన్ లో వానలు అంతంత మాత్రంగానే ఉన్నాయన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని రైతులు సంప్రదాయ వరికి బదులు ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం వస్తున్న నీటిని పొదుపుగా వాడుకోవాలని, తక్కువ నీటి అవసరం ఉన్న పంటలను సాగు చేయాలని చెప్పారు.
జూరాలకు పెరిగిన వరద
జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 53 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లోగా వస్తోంది. జూరాల ప్రాజెక్టులో ప్రస్తుతం 317.06 మీటర్ల మేర నీటి నిల్వ ఉంది. ఇక్కడి నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం 40,613 క్యూసెక్కులు, నెట్టెంపాడు కు 1500, బీమా లిఫ్ట్-1కి 1300, కోయిల్ సాగర్ కు 630, లెఫ్ట్ కెనాల్ కు1,030, రైట్ కెనాల్ కు 500, ప్యారలల్ కెనాల్ కు 700, బీమా లిఫ్ట్-2 కు 750 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.