Reading Time: < 1 minute
Ap Building Rules 2017 Amended Andhra Pradesh Government Approves New Construction Regulations

AP Building Rules: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ బిల్డింగ్ రూల్స్–2017లో కీలక సవరణలు చేస్తూ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ జూలై 29, 2026 తేదీతో తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం సూచించిన డీ-రెగ్యులేషన్ మార్గదర్శకాల మేరకు భవన నిర్మాణ నిబంధనల్లో 23 ప్రాధాన్య అంశాలు, మరో ఐదు కీలక అంశాలకు అనుగుణంగా మార్పులు చేపట్టింది.

భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను మరింత సరళీకరించడం, రిస్క్ ఆధారిత నియంత్రణ విధానాలను అమలు చేయడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు ప్రోత్సాహం ఇవ్వడం ఈ సవరణల ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది. అలాగే పర్యావరణ హిత నిర్మాణాలు, పెట్టుబడులకు అనుకూల విధానాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించింది.

కొత్త నిబంధనలు ఇవే..
కొత్త నిబంధనల ప్రకారం, నాన్ హై-రైజ్ భవనాలకు 24 మీటర్ల ఎత్తు వరకు బాల్కనీల నిర్మాణానికి అనుమతి లభించనుంది. కనీసం మూడు మీటర్ల సెట్‌బ్యాక్ ఉన్న ప్లాట్లలో స్టిల్ట్ లేదా గ్రౌండ్ ఫ్లోర్ పైన 1.5 మీటర్ల వెడల్పుతో బాల్కనీ నిర్మించుకోవచ్చు. అలాగే భవనం ఎత్తును గరిష్టంగా రెండు మీటర్ల వరకు పెంచుకునే అవకాశం కల్పించినప్పటికీ, అనుమతించిన అంతస్తుల సంఖ్యలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. ఈ ఎత్తు పెంపు ఫైర్ సర్వీస్ నిబంధనలకు లోబడి మాత్రమే అమలులో ఉంటుంది.

హై-రైజ్ భవనాలకు సంబంధించి కూడా ప్రభుత్వం పలు కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. పార్కింగ్ ఫ్లోర్ల ఎత్తును సెట్‌బ్యాక్‌ల లెక్కింపులో పరిగణించకపోయినా, మొత్తం భవనం ఎత్తు లెక్కలో వాటిని చేర్చనుంది. అలాగే హై-రైజ్ భవనాల్లో పార్కింగ్ ఏర్పాటు చేసినట్లయితే నిర్దిష్ట వెడల్పుతో మెకానికల్ లిఫ్ట్ లేదా ర్యాంపులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని పేర్కొంది.

ఇక, 5,000 చదరపు మీటర్లకు పైగా నిర్మాణ విస్తీర్ణం ఉన్న వాణిజ్య సముదాయాలు, హౌసింగ్ సొసైటీలు, టౌన్‌షిప్‌లలో ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు తప్పనిసరి చేశాయి. హై-రైజ్ భవనాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, పారిశ్రామిక, హాజార్డస్ భవనాలకు అగ్నిమాపక శాఖ ముందస్తు అనుమతి తప్పనిసరి కాగా, 500 చదరపు మీటర్లకు పైగా ఫ్లోర్ ఏరియా ఉన్న నిర్దిష్ట భవనాలకు కూడా ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్ అవసరమని ఉత్తర్వుల్లో వెల్లడించింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం..