Reading Time: 2 minutes
Rishikanta Singh Chanambam Wins Commonwealth Games 2026 Silver From Daily Wage Worker To Medal Hero

Rishikanta Singh Chanambam: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత వెయిట్‌లిఫ్టర్ “రిషికాంత సింగ్ చానబం” దేశానికి రజత పతకాన్ని అందించాడు. పురుషుల 60 కేజీల విభాగంలో మొత్తం 264 కేజీలు (121 కేజీల స్నాచ్, 143 కేజీల క్లీన్ అండ్ జర్క్) ఎత్తి రెండో స్థానంలో నిలిచాడు. చివరి ప్రయత్నంలో 151 కేజీలు ఎత్తడంలో విజయం సాధించి ఉంటే స్వర్ణ పతకం అతని ఖాతాలో చేరేది.

ఈ రజత పతకం వెనుక ఓ క్రీడాకారుడి విజయం మాత్రమే కాదు.. ఎన్నో కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, జీవితంతో చేసిన పోరాటం దాగి ఉంది. ఒక దశలో వెయిట్‌లిఫ్టింగ్‌కు పూర్తిగా దూరమై, కుటుంబాన్ని ఆదుకోవడానికి నిర్మాణ పనుల్లో రోజువారీ కూలీగా పనిచేసిన రిషికాంత.. ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై భారత్‌కు పతకం అందించాడు.

తన జీవితంలో ఎన్నో కష్టమైన రోజులను గుర్తు చేసుకుంటూ రిషికాంత భావోద్వేగానికి గురయ్యాడు. వెయిట్‌లిఫ్టింగ్‌లో తన భవిష్యత్తు ముగిసిపోయిందని భావించి, ఈ క్రీడకు చెందిన స్నేహితులతో కూడా సంబంధాలు తెంచుకున్నానని అన్నారు. జీవనోపాధి కోసం ఏ పని దొరికితే ఆ పని చేస్తూ, మరుసటి రోజు ఎక్కడ పని దొరుకుతుందో అనే ఆలోచనతోనే రోజులు గడిపానని తెలిపాడు.

రిషికాంత ఇప్పటికే 2016లో జాతీయ యూత్ టైటిల్‌ను గెలుచుకోగా.. 2017 జూనియర్ కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించాడు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉండటంతో వెయిట్‌లిఫ్టింగ్‌ను కొనసాగించడం సాధ్యపడలేదు. రోజుకు కేవలం రూ.150 నుంచి రూ.200 మాత్రమే సంపాదించేవాడినని, ఆ డబ్బుతో.. పాలు, గుడ్లు వంటి పోషకాహారం కొనడం కూడా కష్టంగా ఉండేదని తెలిపాడు. కొన్నిసార్లు ఇంట్లో ఏది ఉంటే అదే తినాల్సి వచ్చేదని, మరికొన్ని సందర్భాల్లో అల్పాహారం లేదా రాత్రి భోజనం కూడా మానేయాల్సి వచ్చేదని గుర్తు చేసుకున్నాడు.

అయితే అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది టక్యెల్‌ లోని వెయిట్‌లిఫ్టింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. అక్కడ శిక్షణ పొందే అవకాశం రావడంతో మళ్లీ వెయిట్‌ లిఫ్టింగ్‌పై దృష్టి సారించాడు. కఠోర శ్రమతో ఏడాది వ్యవధిలోనే తన తొలి సీనియర్ జాతీయ టైటిల్‌ను కైవసం చేసుకుని తిరిగి తన సత్తా చాటాడు. అతని కృషికి మరో నిదర్శనంగా 2025లో అహ్మదాబాద్‌లో జరిగిన కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్లో పురుషుల 60 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. అదే ఆత్మవిశ్వాసంతో కామన్వెల్త్ గేమ్స్‌ లోనూ రజత పతకాన్ని గెలుచుకుని మరోసారి తన ప్రతిభను చాటాడు.

స్వర్ణ పతకం చేజారినప్పటికీ తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ రిషికాంత కృతజ్ఞతలు తెలిపాడు. ముఖ్యంగా భారత ప్రధాన కోచ్ విజయ్ శర్మ తనకు పోటీల్లో ఎలా ఆడాలి.? ఎలా శిక్షణ పొందాలి.? అనే విషయంలో ఎంతో మార్గనిర్దేశనం చేశారని కొనియాడాడు. అలాగే భారత క్రీడలకు విశేష ప్రోత్సాహం అందిస్తున్నందుకు ఈ విజయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నాడు.