Reading Time: < 1 minute
Parliament Monsoon Session Public Examinations Amendment Bill Supreme Court Judges Bill To Be Tabled Today

Parliament Monsoon Session: వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా సోమవారం లోక్‌సభలో రెండు కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. “పబ్లిక్ పరీక్షలు (అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లు-2026తో పాటు “సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) బిల్లు”పై చర్చించి ఆమోదం పొందే ప్రయత్నం చేయనుంది. అయితే గత ఐదు రోజులుగా ఉభయ సభలు వరుసగా వాయిదా పడిన నేపథ్యంలో.. నేటి సమావేశాలు కూడా ప్రతిపక్షాల ఆందోళనలతో వాడివేడిగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆగస్టు 13 వరకు మొత్తం 19 రోజుల పాటు జరగనున్న వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. అయితే ఇప్పటివరకు ఎలాంటి శాసన కార్యక్రమాలు సజావుగా సాగలేదు. మరోవైపు ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో ప్రతిపక్ష పార్టీల నేతలు సమావేశమై తమ వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్, పెల్లెట్ గన్ ప్రయోగం, పోలీసుల దాడుల అంశాన్ని ఉభయ సభల్లో లేవనెత్తాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. ఈ ఘటనపై చర్చకు అనుమతివ్వాలని తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు సాగరికా ఘోష్ నోటీసు ఇచ్చారు. అలాగే ఈ ఘటనకు బాధ్యత వహించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖ రాస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదిలా ఉంటే.. విద్యార్థుల 49 రోజుల ఆందోళన తర్వాత ఇచ్చిన హామీ మేరకు పబ్లిక్ పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సవరణ బిల్లును తీసుకొస్తోంది. ఈ బిల్లును సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అలాగే జాతీయ పరీక్షల సంస్థ (NTA)లో సంస్కరణల కోసం ప్రముఖ సాంకేతిక నిపుణుడు నందన్ నీలేకని నేతృత్వంలో ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కొత్త సవరణ బిల్లు ప్రకారం ప్రభుత్వ పరీక్షల్లో పేపర్ లీకేజీలు, కాపీయింగ్, ఇతర అక్రమాలకు పాల్పడిన వారికి గరిష్ఠంగా 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10 కోట్ల వరకు జరిమానా విధించేలా కఠిన నిబంధనలు తీసుకురానున్నారు. దీంతో ఈ బిల్లుపై పార్లమెంట్‌లో చర్చ జరిగే అవకాశం ఉంది.