Reading Time: < 1 minute

అసోంలో భారీ అగ్ని ప్రమాదం.. ఐరన్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి ఆరుగురు మృతి

Caption of Image.

దిస్‎పూర్: అసోంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కచార్ జిల్లా ప్రాంగ్రామ్ ప్రాంతంలోని ఐరన్ రాడ్ తయారీ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో తయారీ యూనిట్‎లో కార్మికులు పనిలో నిమగ్నమై ఉన్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తీవ్ర భయాందోళనకు గురై పరుగులు తీశారు. 

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటనస్థలిని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. గ్యాస్ సిలిండర్ పేలుడు కారణంగా ఫ్యాక్టరీలో మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. 

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అగ్ని ప్రమాద ఘటనపై అస్సాం సీఎం హిమాంత బిస్వా శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. 

 

©️ VIL Media Pvt Ltd.