Reading Time: < 1 minute
Bandi Sanjay Challenge To Revanth Reddy Gen Z Ministers

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శంషాబాద్ విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడుతూ సంచలన సవాల్ విసిరారు. రాష్ట్రంలో మాటలు చెప్పడం కాదని, చిత్తశుద్ధి ఉంటే 21 నుండి 30 ఏళ్ల వయస్సున్న ‘జెన్-జీ’ (Gen-Z) యువతకు మంత్రి పదవులు ఇచ్చి ఆచరణలో చూపించాలని డిమాండ్ చేశారు. సీఎం వద్ద ఖాళీగా ఉన్న హోమ్, విద్యా, మున్సిపల్ వంటి కీలక శాఖలను యువతకే అప్పగించాలని వ్యాఖ్యానించారు. అవసరమైతే ప్రస్తుతం ఉన్న కొందరు ఎమ్మెల్సీలతో రాజీనామా చేయించి, ఆ పదవులను జెన్-జీ యువతకు ఇవ్వాలని, కాంగ్రెస్ దృష్టిలో జెన్-జీ లంటే విహెచ్, కేకే, కోదండరెడ్డి అనుకుంటున్నారా అంటూ సంజయ్ ఎద్దేవా చేశారు.

వయోభారంతో ఉన్న పెద్దలకు యూత్ కోటాలో పదవులు కట్టబెట్టడం కాంగ్రెస్‌ పార్టీకి అలవాటేనని బండి సంజయ్ ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ సంస్కృతికి భిన్నంగా భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ “దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పర్సన్ లాస్ట్” అనే సిద్ధాంతానికే కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఆ సిద్ధాంతంలో భాగమే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అని గుర్తుచేశారు. యువతకు ప్రాధాన్యత ఇస్తున్నామని మాటలతో మోసం చేయకుండా, నిజంగా యువ శక్తిపై నమ్మకం ఉంటే రాష్ట్ర పాలనలో వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని రేవంత్ రెడ్డి సర్కారును సంజయ్ డిమాండ్ చేశారు.