Reading Time: < 1 minute
Chitrakoot Gang Rape Main Accused Arrested After Encounter

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాలో నీట్ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడు జితేంద్ర అలియాస్ భోలాను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసి, అరెస్ట్ చేశారు. భారతికూప్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మడ్ఫా అడవుల్లో నిందితుడు దాక్కున్నాడనే సమాచారంతో యూపీ పోలీసులు, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్(ఎస్ఓజీ) జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. ఆపరేషన్ సమయంలో నిందితుడు పోలీసులపై కాల్పులు జరపడంతో, పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నిందితుడి కాలికి బుల్లెట్ గాయాలయ్యాయి. కాల్పుల ఘటనలో బహిల్‌పుర్వా పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ రాఘవేంద్ర కూడా గాయపడ్డారు. అంతకుముందు, నిందితుడిపై పోలీసులు రూ. 50,000 వేల రివార్డు ప్రకటించారు.

జూలై 22న మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాకు చెందిన 20 ఏళ్ల విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి దేవంగన ఎయిర్‌పోర్టు సమీపంలో నడుస్తుండగా ముగ్గురు వ్యక్తులు అటవీ అధికారులమని చెబుతూ అడ్డుకున్నారు. యువకుడిని చెట్టుకు కట్టేసి, విద్యార్థినిపై ఇద్దరు నిందితులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు అనంతరం ప్రత్యేక దర్యాప్తు బృందాలు నిందితుడి కోసం గాలింపు చేపట్టాయి. సీసీటీవీ ఫుటేజ్, ఎలక్ట్రానిక్ నిఘా, స్థానిక సమాచారంతో నిందితులను గుర్తించారు. బాధితురాలు ఫోటోల ద్వారా నిందితుల్ని గుర్తించింది. నిందితుడి వద్ద నుంచి రెండు అక్రమ .315 బోర్ పిస్టళ్లు, తూటాలు, ఒక మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని చిత్రకూట్ ఎస్పీ అరుణ్ కుమార్ సింగ్ వెల్లడించారు.