Reading Time: < 1 minute
Houthi Missile Drone Attack Saudi Aramco Jizan Red Sea Tensions

Saudi Arabia: సౌదీ అరేబియాపై యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులు మిస్సైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడ్డారు. జిజాన్ పారిశ్రామిక నగరంలో భారీ పేలుళ్ల శబ్దాలు వినబడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు సంస్థ అయిన సౌదీ అరామ్‌కోకు చెందిన ప్లాంట్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరగడం కలకలం రేపింది. ఈ క్షిపణి దాడుల ప్రభావంతో జిజాన్, యాన్‌బు, దమాద్ వంటి పలు కీలక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ముందస్తు జాగ్రత్త చర్యగా సౌదీ సివిల్ డిఫెన్స్ విభాగం యాన్‌బు ప్రావిన్స్ ప్రజల కోసం ‘నేషనల్ ఆర్లీ వార్నింగ్ ప్లాట్‌ఫామ్’ ద్వారా అత్యవసర హెచ్చరికలను (Emergency Alerts) జారీ చేసింది.

హోదైదాపై సౌదీ దాడికి ప్రతికారంగా చర్యలు

అమెరికా-ఇరాన్ మధ్య ప్రాంతీయ యుద్ధ పూరిత వాతావరణం నెలకొన్న వేళ, హూతీలకు-సౌదీకి మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పరాకాష్టకు చేరాయి. శుక్రవారం రాత్రి హూతీల ఆధీనంలో ఉన్న హోదైదా నగరంతో పాటు కామరాన్ ఐలాండ్, టెలికమ్యూనికేషన్స్ భవనాలపై సౌదీ దాడులు చేసింది. ఈ దాడులకు తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన హూతీ దళాలు.. దానికి ప్రతికారంగానే సౌదీలోని చమురు మౌలిక వసతులు, యెర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న సౌదీ ఆయిల్ ట్యాంకర్లపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించాయి. సనా విమానాశ్రయంపై దాడి నేపథ్యంలో జూలై 20న హూతీలు విధించిన దిగ్బంధనంలో (Blockade) భాగంగానే ఈ దాడులు చోటుచేసుకున్నాయి. 2022 నుంచి ఇరువర్గాల మధ్య కొనసాగుతున్న అనధికారిక శాంతి ఒప్పందం పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో, రెడ్ సీ (ఎర్ర సముద్రం) మార్గంలో అంతర్జాతీయ వ్యాపార నౌకల రాకపోకలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.