
పాలమూరు రైతాంగానికి సాగునీరు, ఉచిత విద్యుత్ అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు (కేటీఆర్) తీవ్రస్థాయిలో విమర్శించారు. వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలోని సబ్ స్టేషన్ నుంచి సుభాష్ చౌరస్తా వరకు నిర్వహించిన భారీ నిరసన ర్యాలీలో మాజీంత్రులు నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం మళ్లీ పాతరోజుల నాటి విద్యుత్, నీటి కష్టాల్లోకి జారుకుందని ఆరోపించారు.
విద్యుత్ కష్టాలతో కాలిపోతున్న మోటార్లు
ర్యాలీకి ముందు గుమ్మడం, పెబ్బేరు విద్యుత్ సబ్ స్టేషన్లను సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. రోజుకు 12 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఐదారు గంటలు కూడా సరిగ్గా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రోజుకు పది పన్నెండు సార్లు కరెంట్ పోతుండటంతో రైతుల స్టార్టర్లు, మోటార్లు కాలిపోతున్నాయని మండిపడ్డారు. పాత రోజులు తెస్తానని చెప్పిన ముఖ్యమంత్రి, నిజంగానే నాటి చీకటి రోజులను, కరెంట్ కోతలను తిరిగితీసుకొచ్చారని ఎద్దేవా చేశారు.
కృష్ణా జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం
కృష్ణా నదికి 248 టీఎంసీల నీళ్లు వచ్చినా పాలమూరు రైతుల నోట్లో ప్రభుత్వం మట్టి కొట్టిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యథేచ్ఛగా కృష్ణా నీటిని తరలించుకుపోతుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం చూస్తూ ఉండిపోయారని విమర్శించారు. జూరాల ప్రాజెక్టు కింద కేవలం 18 టీఎంసీలు, కల్వకుర్తి ఎత్తిపోతల కింద 10 టీఎంసీలకు మించి నీళ్లు ఇవ్వలేదని ఆరోపించారు. కల్వకుర్తిలో ఉన్న మూడు పంపులను కూడా సరిగ్గా నడపలేకపోతున్నారని విమర్శించారు. జూరాల ఆయకట్టు కింద ఉన్న లక్షా పది వేల ఎకరాల్లో ఒక్క ఎకరం ఎండిపోయినా ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
రైతు బంధు, బీమా పథకాలకు గండి
కేసీఆర్ హయాంలో లభించిన సంక్షేమం ఇప్పుడు కరువైందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడోసారి రైతు బంధు ఎగ్గొట్టిందని, రైతు బీమా ప్రీమియం కూడా కట్టకుండా రైతులను ఆగాం చేసిందని ఆరోపించారు. “మోసపోతే గోసపడతాం” అని కేసీఆర్ నాడు చెప్పిన మాటలు ఈరోజు అక్షరసత్యాలయ్యాయని వ్యాఖ్యానించారు. సొంత జిల్లాలోనూ ఉచిత విద్యుత్ రాక రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితులు వచ్చాయంటే సీఎం పాలనా వైఫల్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై రాజకీయం
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం 90 శాతం పూర్తి చేసిందని, అయితే కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే నెపంతో రేవంత్ రెడ్డి ఆ పనులను పక్కనబెట్టారని కేటీఆర్ ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శ్రీశైలం నుంచి నీటిని దోచుకుంటున్నా మౌనంగా ఉంటున్నారని విమర్శించారు. తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి తక్షణమే నీటిని విడుదల చేయించాలని డిమాండ్ చేశారు. రైతుల హక్కుల సాధన కోసం బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.