
హైదరాబాద్ లో పశువులు, మొబైల్ ఫోన్లు దొంగలిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. దొంగతనం చేసిన మొబైల్స్ ను బాంగ్లాదేశ్ కు తరలిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు అధికారులు. హైదరాబాద్ సిటీ పోలీస్, టాస్క్ ఫోర్స్ పోలీసులు ఖమ్మం పోలీసులు, సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ లో తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
ఈ ముఠా మొదటగా పశువులను దొంగతనం చేసేవారని..ఆ తర్వాత మొబైల్ షాపుల్లో దొంగతనాలు మొదలుపెట్టారని తెలిపారు పోలీసులు. నిందితుల దగ్గర నుండి 15 మొబైల్స్ , 03 కార్లు, రూ. 22 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు. రంజాన్, బక్రీద్ పండుగల సమయంలో నిందితులు పశువుల దొంగతనానికి పాల్పడ్డారని.. నాగర్ కర్నూల్, ఖమ్మం,మహబూబ్ నగర్, ఫ్యూచర్ సిటీ ప్రాంతాలలో ఎక్కువగా పశువుల దొంగతనాలకి పాల్పడేవారని తెలిపారు పోలీసులు.
పశువులను సులువుగా తరలించేదుకు XYLAZINE అనే మత్తు ఇంజక్షన్ ఇచ్చి వాహనాలలోకి ఎక్కించి తరలించేవారని.. సాయి రెడ్డి అనే వ్యక్తి మత్తు ఇంజక్షన్స్ ని సరఫరా చేసేవాడని తెలిపారు పోలీసులు.ఈ పశువుల దొంగతనాలలో తబ్రేజ్, రఫిక్ లు ప్రధాన పాత్రధారులుగా ఉన్నట్లు తెలిపారు.
రంజాన్, బక్రీద్ ముగిసిన తరువాత మొబైల్ దొంగతనాలకి అలవాటు పడ్డారని.. తబ్రేజ్, రఫిక్, ఫరహాన్ విజయవాడ లో బిగ్-సి మొబైల్ షాప్ లో దొంగతనానికి ప్రయత్నించారని.. ఆ ప్రయత్నం విఫలం అయ్యిందని తెలిపారు. జూన్ 11న ఈ ముగ్గురు కలిసి ఖమ్మం లోని సోనోవిజన్ మొబైల్ షాప్ లో దొంగతనం కి పాల్పడ్డారని.. మధ్యవర్థుల ద్వారా చోరీ చేసిన మొబైల్స్ ని జావిధ్ ఖాన్ కి 20 లక్షలకి అమ్మారని తెలిపారు. ఆ రోజు నుండి ఖమ్మం పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు పోలీసులు.
నిందితులు హైదరాబాద్ నుండి మధ్యప్రదేశ్ కి వెళ్లారని.. అక్కడ కూడా మొబైల్స్ చోరీలకి పాల్పడ్డారని.. బంగ్లాదేశ్ కి చెందిన ఖాసీం చోరీ చేసిన మొబైల్స్ ని ముంబై, కలకత్తా మీదుగా బంగ్లాదేశ్ కి తరలించేవాడని తెలిపారు. బంగ్లాదేశ్ కి స్మగ్లింగ్ చేసి అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించేవారని.. హవాలా మార్గాల్లో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని తెలిపారు పోలీసులు. IMEI నెంబర్లను ట్రాక్ చేయడం కష్టతరమయ్యే విదేశీ మార్గంలో ఈ మొబైల్ ఫోన్ లను తరలించారని అన్నారు పోలీసులు.
ఆగస్టు 17న హైదరాబాద్ నగరంలో మరో నేరానికి పన్నాగం పన్నుతుండగా నేరం జరగకముందే టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని.. పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.