
Sandeep Reddy Vanga: వరంగల్ ప్రజల దశాబ్దాల స్వప్నమైన విమానాశ్రయం ఎట్టకేలకు కార్యరూపం దాలుస్తుండటంతో ఓరుగల్లు గడ్డపై సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మామునూరు ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనులను పరుగులు పెట్టిస్తుండటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తన సొంత ఊరి విమానాశ్రయంపై స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెబుతూ ఎక్స్ వేదికగా పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కేవలం థ్యాంక్స్ చెప్పడమే కాకుండా, ఎయిర్‌పోర్ట్ పేరు విషయంలో సందీప్ రెడ్డి వంగా చేసిన సూచన సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వరంగల్‌లో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కల నెరవేరుతుండటంపై సందీప్ రెడ్డి వంగా అమితానందం వ్యక్తం చేశారు. ఈ విమానాశ్రయానికి వరంగల్ చారిత్రక వైభవం, సాంస్కృతిక స్ఫూర్తిని ప్రతిబింబించేలా పేర్లు పెట్టాలని ఆయన సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు.
ఇందుకోసం ఆయన రుద్రమ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (RIA – Rudrama International Airport), కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (KIA – Kakatiya International Airport) పవర్‌ఫుల్ పేర్లను సూచించారు. కాకతీయుల వీరత్వం, రాణి రుద్రమదేవి సాహసాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని, అటువంటి చారిత్రక నేపథ్యం ఉన్న పేర్లను ఈ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఖరారు చేస్తే ఎంతో అర్థవంతంగా ఉంటుందని వంగా తన పోస్ట్‌లో పేర్కొన్నారు. తన సొంత గడ్డపై ఎయిర్‌పోర్టును నిజం చేస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. “వరంగల్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం చివరకు నిజమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీనిని సాకారం చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు” అంటూ సందీప్ రాసుకొచ్చారు. వరంగల్ ముద్దుబిడ్డగా అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్టార్ డైరెక్టర్ వంగా చేసిన ఈ సూచనకు నెటిజన్లు, ముఖ్యంగా ఓరుగల్లు వాసులు భారీ మద్దతు తెలుపుతున్నారు.
Very happy to know that the International Airport in my hometown WARANGAL, is finally becoming a reality.
My suggestions for the name would be: Rudrama International Airport (RIA), Kakatiya International Airport (KIA).
It would be truly meaningful to give this airport a name…
— Sandeep Reddy Vanga (@imvangasandeep) September 19, 2026
