
హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. ప్రమాదానికి గురైన బాధితురాలిని తన కాన్వాయ్‌లో ఆసుపత్రికి తరలించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. వివరాల ప్రకారం.. శనివారం (సెప్టెంబర్ 19) ఓ ఫ్యామిలీ కారులో సిద్దిపేట నుంచి గజ్వేల్ బయలుదేరింది. ఈ క్రమంలో కారు ప్రమాదవశాత్తూ అదుపుతప్పి నడిరోడ్డుపై బోల్తా పడింది.
ప్రమాద సమయంలో కారులో ముగ్గురు ఉండగా.. యువతి తీవ్రంగా గాయపడింది. కారు ఎయిర్ బ్యాగ్ తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. సిద్దిపేటలో ఎగ్జామ్ రాసిన కూతురును తల్లిదండ్రులు కారులో గజ్వేల్‌కు తీసుకొస్తుండగా ఘటన చోటు చేసుకుంది.
అదే సమయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సిరిసిల్ల వెళ్తున్నారు. ప్రమాదాన్ని గమనించిన ఆయన వెంటనే తన కాన్వాయ్‌ను ఆపి భద్రతా సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి వెళ్లి బాధితులని కారులోనుంచి తీశారు. వెంటనే తన కాన్వాయ్‌లోని పోలీస్ వాహనంలో బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.