
Women AP Premier League 2026: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) క్రీడా రంగంలో నూతన ఉత్సాహాన్ని నింపుతూ ఉమెన్ ఏపీఎల్ (Women AP Premier League – WAPL) సీజన్-1 టోర్నమెంట్ అధికారికంగా ప్రారంభమైంది. మంగళగిరిలోని అత్యాధునిక స్టేడియంలో జరిగిన ఈ ప్రారంభోత్సవ వేడుక క్రీడా ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ వేడుకలో పాల్గొన్న నారా బ్రాహ్మణి (Nara Brahmani) స్వయంగా ఉమెన్ ఏపీఎల్ (Women AP Premier League) ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా క్రీడాకారిణులకు ఇదొక అద్భుతమైన వేదిక అని ప్రశంసించారు. ప్రతిభ ఉండి సరైన అవకాశాలు లభించని యువతకు ఈ టోర్నమెంట్ చక్కటి భవిష్యత్తును ఇస్తుందని, దక్కిన ప్రతి అవకాశాన్ని క్రీడాకారిణులు నమ్మకంతో సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాల మహిళలకు ఈ వేదిక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ అట్టహాస వేడుకలో విజయవాడ ఎంపీ (Vijayawada MP) అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (Andhra Cricket Association – ACA) అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (Kesineni Sivanath), కార్యదర్శి సానా సతీష్ (Sana Satish), గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ సుజయ్ కృష్ణరంగారావు (Sujay Krishna Ranga Rao) తదితరులు పాల్గొన్నారు. అలాగే సినీ నటి స్నిగ్ధ (Snigdha) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ గాయకులు హేమచంద్ర (Hemachandra), గీతా మాధురి (Geetha Madhuri) తమ మధురమైన పాటలతో మైదానంలో ఉన్న ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలతో స్టేడియం మొత్తం కోలాహలంగా మారింది.
ఈ టోర్నమెంట్‌లో భాగంగా ఉమెన్ ఆంధ్ర ప్రిమియర్ లీగ్ (Women Andhra Premier League) సీజన్-1 తొలి మ్యాచ్‌లో అమరావతి ఈగల్ ఛాంపియన్స్ (Amaravati Eagle Champions), వైజాగ్ ఫైర్‌బర్డ్స్ (Vizag Firebirds) జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మహిళా క్రికెట్‌ను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రారంభమైన ఈ లీగ్ మ్యాచ్‌లు రాబోయే రోజుల్లో మరింత రసవత్తరంగా సాగనున్నాయి.