Reading Time: < 1 minute
Travis Head Breaks Silence On Virat Kohli Ipl 2026 Controversy

Travis Head: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఆటగాడు ట్రావిస్ హెడ్ ఐపీఎల్ 2026 సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఈ గొడవ అనంతరం.. సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ మిన్నంటాయి. ఈ అంశంపై హెడ్ తొలిసారిగా స్పందించాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీతో సంబంధాలు దెబ్బతిన్నాయంటూ వచ్చిన వార్తలన్నింటినీ హెడ్ కొట్టిపారేశాడు.

ఐపీఎల్ మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్‌కి హ్యాండ్ షేక్ ఇవ్వలేదనేలా కొన్ని దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే ఈ పుకార్లకు చెక్ పెడుతూ ‘కోడ్ స్పోర్ట్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హెడ్ మాట్లాడాడు. “మా మధ్య ప్యాచ్-అప్ (రాజీ) చేసుకోవడానికి ఏమీ లేదు. కోహ్లీతో నా సంబంధాలు ఎప్పటిలాగే సాధారణంగా ఉన్నాయి. మైదానంలో ఏం జరిగిందో అది లీగ్ ప్రక్రియలో భాగమే తప్ప, మా మధ్య ఎలాంటి వివాదం లేదు” అని స్పష్టం చేశాడు.

మైదానంలో జరిగే విషయాలను ప్రొఫెషనల్ క్రికెటర్‌గా తాను స్వీకరిస్తానని, కానీ సోషల్ మీడియాలో తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం తీవ్రంగా బాధించిందని హెడ్ వాపోయాడు. ఈ వివాదం సమయంలో తన భార్య జెస్సికా హెడ్‌కు సోషల్ మీడియాలో అనేక అభ్యంతరకర మెసేజ్‌లు వచ్చాయని తెలిపాడు. “నేను, జెస్సికా క్రీడా ప్రపంచంలో ఇవన్నీ సహజమని గ్రహించాం. కానీ ఈ ట్రోలింగ్ మా ఇతర కుటుంబ సభ్యులకు చేరినప్పుడే ఇబ్బందిగా మారింది. జెస్సికా ఈ పరిస్థితిని చాలా పరిణతితో (Maturity) ఎదుర్కొంది. కొద్దిరోజుల్లోనే ప్రజలు ఇవన్నీ మరచిపోతారు. కానీ ఆటగాళ్ల కుటుంబాలను ఆన్‌లైన్ నిందలకు గురిచేయడం నిజంగా దురదృష్టకరం” అని హెడ్ పేర్కొన్నాడు.