July 22, 2026

Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!

Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
Reading Time: < 1 minute
Kavya Maran Pakistan Player Controversy Jacob Bethell Injured The Hundred

ది హండ్రెడ్ టోర్నీలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ రూ. 2.45 కోట్లకు కొనుగోలు చేయడం పెద్ద వివాదానికి దారితీసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ , సన్‌రైజర్స్ లీడ్స్ యజమాని కావ్య మారన్ ఈ వేలంలో స్వయంగా పాల్గొని అబ్రార్‌ను దక్కించుకున్నారు. అయితే పాకిస్థాన్ ఆటగాళ్ల ఎంపికపై చెలరేగిన వివాదంపై మాట్లాడటానికి ఆమె నిరాకరించారు. ది టెలిగ్రాఫ్‌తో జరిగిన సంభాషణలో ఈ ఘటనపై స్పందిస్తూ, వివాదాస్పద అంశాలను దాటవేసి.. తమ పురుషుల, మహిళల జట్ల పట్ల చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. తాము అన్ని విభాగాల్లో సమర్థులైన ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నామని మాత్రమే ఆమె వ్యాఖ్యానించారు.

మరోవైపు.. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ జాకబ్ బెథెల్ కుడి మోకాటి గాయం కారణంగా ఈ ఏడాది ది హండ్రెడ్ టోర్నీ నుంచి వైదొలిగాడు. ఇది బర్మింగ్‌హామ్ ఫోనిక్స్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. 21 ఏళ్ల బెథెల్‌ను బర్మింగ్‌హామ్ ఫోనిక్స్ రూ. 3.65 కోట్లకు నిలుపుకోవడమే కాకుండా, 2026 సీజన్‌కు కెప్టెన్‌గా కూడా ప్రకటించింది. ఇటీవల ఇండియాతో జరిగిన వన్డే సిరీస్ సమయంలో గాయపడిన బెథెల్‌కు సోమవారం ఉదయం ఎంఆర్‌ఐ స్కాన్ చేయగా గాయం తీవ్రత వెలుగులోకి వచ్చింది. దీంతో అతను టోర్నీకి దూరం కాక తప్పలేదు.

గాయం తీవ్రత కారణంగా వచ్చే నెలలో పాకిస్థాన్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌లో కూడా బెథెల్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. ఆగస్టు 19న హెడింగ్లే వేదికగా మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ECB) అతను కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో స్పష్టం చేయలేదు కానీ పునరావాస ప్రక్రియ ప్రారంభమైందని తెలిపింది. స్వదేశీ అభిమానుల ముందు ఆడలేకపోవడం .. కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం కోల్పోవడంపై బెథెల్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. త్వరలోనే పూర్తి ఫిట్‌నెస్‌ సాధించి పునరాగమనం చేస్తానని ధీమా వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్ భవిష్యత్తు నాయకుడిగా పేరుగాంచిన బెథెల్ వైదొలగడం బర్మింగ్‌హామ్ ఫోనిక్స్ జట్టును ఆందోళనకు గురిచేసింది.