నేషనల్ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల ఆరోపణలు.. ట్రైనీ ఐపీఎస్పై కేసు నమోదు

ఐపీఎస్ లకు ట్రైనింగ్ ఇచ్చే నేషనల్ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం కలకలం రేపింది. అకాడమీలో ఓ ఐపీఎస్ ట్రైనీ మరో ట్రైనీపై లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. వేధింపులకు పాల్పడిన ట్రైనీపై కేసు నమోదు కావడం సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. తోటి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డి లైంగికంగా వేధిస్తున్నాడంటూ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం (జులై 19) కేసు నమోదు చేశారు పోలీసులు.
తన అనుమతి లేకుండా వీడియోలు తీశాడని బాధితురాలు ఆరోపించారు. వీడియోలతో బెదిరింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు.
నిందితుడిపై బీఎన్‌ఎస్ సెక్షన్లు 74, 75, 77, 315(2), 66(E) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.