July 21, 2026

ఈ మిస్టెక్‌లు అస్సలు చేయొద్దు.. సేమియా పాయసం చిక్కబడకుండా టేస్టీగా ఉండాలంటే ఇలా చేయండి

ఈ మిస్టెక్‌లు అస్సలు చేయొద్దు.. సేమియా పాయసం చిక్కబడకుండా టేస్టీగా ఉండాలంటే ఇలా చేయండి
Reading Time: 2 minutes
ఈ మిస్టెక్‌లు అస్సలు చేయొద్దు.. సేమియా పాయసం చిక్కబడకుండా టేస్టీగా ఉండాలంటే ఇలా చేయండి

పండగలు, శుభకార్యాలు లేదా ఇంట్లో ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అందరికీ ముందుగా గుర్తొచ్చేది సేమియా పాయసం. అయితే పాయసం చేసిన కొద్దిసేపటికే అది గట్టిగా, ముద్దలా అయిపోతుంటుంది. అలా కాకుండా ఎంతసేపైనా పాయసం చిక్కబడకుండా, హోటల్ లేదా క్యాటరింగ్ స్టైల్‌లో క్రీమీగా, పర్ఫెక్ట్ లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉండాలంటే కొన్ని చిన్న చిట్కాలు పాటించాలి. వంట నిపుణుల ఆధారంగా.. అస్సలు చిక్కబడని సేమియా పాయసం తయారీ విధానాన్ని పక్కా కొలతలతో ఇక్కడ తెలుసుకుందాం..

సరైన కొలతలు (ఒక కప్పు సేమియాకు):

  • సేమియా – 1 కప్పు
  • పాలు – 4 కప్పులు (మొదట 3 కప్పులు, చివర్లో 1 కప్పు)
  • నీళ్లు – 2 కప్పులు
  • చక్కెర (షుగర్) – 1 కప్పు
  • నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు
  • డ్రై ఫ్రూట్స్ – ¼ కప్పు (జీడిపప్పు, బాదం, పిస్తా, కిస్మిస్, ఖర్జూరం వంటివి)
  • యాలకుల పొడి (ఇలాచీ పౌడర్) – ¼ టీస్పూన్

పాయసం తయారీ విధానం:

డ్రై ఫ్రూట్స్ – సేమియా వేయించడం: ముందుగా స్టవ్ మీద కాస్త మందపాటి గిన్నెను పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి. నెయ్యి కరిగి వేడెక్కిన తర్వాత అందులో పావు కప్పు డ్రై ఫ్రూట్స్ వేసి మంటను సిమ్‌లో ఉంచి దోరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేగిన డ్రై ఫ్రూట్స్‌ని ఒక బౌల్‌లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో మిగిలిన నెయ్యిలో ఒక కప్పు సేమియా వేసి, లో ఫ్లేమ్‌లోనే 2 నుండి 3 నిమిషాల పాటు చక్కటి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి, ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి.

పాలు, నీళ్లు మరిగించడం: వేరొక గిన్నెలో (లేదా అదే గిన్నెలో) 3 కప్పుల పాలు (పచ్చి పాలు లేదా మరిగించిన పాలు ఏదైనా పర్వాలేదు).. 2 కప్పుల నీళ్లను పోయాలి. అంటే మొత్తం 5 కప్పుల లిక్విడ్ ఇక్కడే యాడ్ చేస్తున్నాం. పాలు మరుగుతున్నప్పుడు పైన మీగడ కట్టకుండా గరిటతో తిప్పుకుంటూ మరిగించుకోవాలి.

సేమియా ఉడికించడం: పాలు బాగా మరుగుతున్న సమయంలో ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాను వేయాలి. సేమియా గడ్డలు కట్టకుండా కంటిన్యూస్‌గా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో 5 నుండి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సేమియా ఉడికిన తర్వాత పరిమాణంలో డబుల్ అవుతుంది.

ముఖ్యమైన చిట్కా: సేమియా పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే చక్కెర వేయాలి. ముందే చక్కెర వేస్తే సేమియా అస్సలు ఉడకదు.

చక్కెర – సీక్రెట్ టిప్ (చివరి కప్పు పాలు): సేమియా మెత్తగా ఉడికిన తర్వాత అందులో ఒక కప్పు చక్కెర వేసి, అది పూర్తిగా కరిగేంత వరకు ఉడికించాలి. చక్కెర కరిగిన తర్వాత పాయసం చిక్కబడకుండా ఉండేందుకు ఇందులో ఒక కప్పు కాచి చల్లార్చిన పాలను చివరగా పోయాలి. ఇలా చివరి దశలో పాలు కలపడం వల్ల పాయసం ఆరిపోయిన తర్వాత కూడా అస్సలు గట్టిపడదు. పాలు పోసాక మరో రెండు నిమిషాలు మరిగించాలి.

చివరగా పావు టీస్పూన్ యాలకుల పొడి వేసి కలిపి, ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన, అస్సలు చిక్కబడని సేమియా పాయసం సిద్ధమవుతుంది.

గుర్తుంచుకోవలసిన చిట్కాలు:

సేమియాను నెయ్యిలో మంచి గోల్డెన్ కలర్ వచ్చేలా వేయిస్తే పాయసంలో ముద్ద అవ్వకుండా విడివిడిగా ఉంటుంది.

1 కప్పు సేమియాకు మొత్తం 4 కప్పుల పాలు, 2 కప్పుల నీళ్లు, 1 కప్పు చక్కెర వేస్తే స్వీట్‌నెస్ – కన్సిస్టెన్సీ చాలా పర్ఫెక్ట్‌గా సరిపోతాయి.

వేడి వేడిగా ఉన్నప్పుడే కాకుండా, చల్లారిన తర్వాత కూడా ఈ పాయసం అంతే అమృతంలా జారుగా ఉంటుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..